ఒకటా రెండా.. 10 ఏళ్లపాటు నిరీక్షణకు తెరపడింది..! కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైనందుకు ఏపీని మోదీ గుండెల్లో పెట్టుకున్నారు..! అనుకున్నట్లుగానే కేంద్ర బడ్జెట్‌లో గట్టిగానే నిధులు కేటాయించారు..! దీంతో సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించనట్టే అయ్యింది..! అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం చేసిన కేంద్రం.. రాజధాని అభివృద్ధికి అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని పార్లమెంట్ వేదికగా క్లియర్ కట్‌గా ప్రకటన చేసింది కేంద్రం. దీంతో పాటు.. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపులో ఎలాంటి ఢోకా లేకుండా అందిస్తామని కేంద్రం బడ్జెట్‌లో తెలిపింది.
ఉన్నాం.. విన్నాం.. చేస్తాం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం అని చెప్పిన కేంద్రం.. భారత ఆహార భద్రతకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమైందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందజేస్తామని.. దీంతోపాటు విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని కేంద్రం చెప్పింది. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో స్పష్టం చేసింది కేంద్రం. విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని.. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తెలియజేసింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద, ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని కేంద్రం క్లియర్ కట్‌గా తెలిపింది. మొత్తానికి చూస్తే.. ఏపీకి మేము ఉన్నాం.. కష్టాలు చూశాం.. విన్నాం.. కావాల్సిన ఇస్తాం.. అన్నీ చేస్తామని భరోసా ఇచ్చింది కేంద్రం.
విమర్శలు కూడా..!
కేంద్రం సాయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మన రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ధిక సంవత్సరం 2024-25 యూనియన్ బడ్జెట్‌లో APలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు ఇవ్వడం సంతోషకరం. కేంద్రం నుంచి వచ్చే ఈ సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రగతిశీల,విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ను సమర్పించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక పవన్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఏపీకి రూ. 15వేలు మాత్రమే కేటాయించి, బీహార్‌కు మాత్రం రూ. 26వేల కోట్లు కేటాయించడంతో ఒకింత అసంతృప్తి అయితే ఉందన్నది సామాన్యుడి మాట. ప్రత్యేక హోదా మాటే లేకుండా పోయింది.. దీనిపై పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. మోదీ తన ప్రధాని సీటును కాపాడుకోవడానికి మద్దతిచ్చిన రాష్ట్రాలకు మాత్రమే ఈ రేంజిలో కేటాయించారని.. మిగిలిన రాష్ట్రాలను పట్టించుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.