అదేదో.. అయ్యయో చేతిలో డబ్బులు పాయెనే అనే సినిమా పాట ఉంది కదా..! అలా ఇప్పుడు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటరయ్యారు..! నేనున్నా.. మీరు ముందుకు పదండి అని చెప్పేవాళ్లు.. కనీసం కలిసుందాం పద అని ధీమాగా చెప్పేవాళ్లు ఒక్కరంటే ఒక్కరూ లేకపోతిరే అని ఆలోచనలో పడ్డారట జగన్. మీడియా, సోషల్ మీడియా.. వ్యక్తిగతంగా ఫోన్లు ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రయత్నాలు చేసినా అబ్బే.. మీ గోల మాకెందుకు..? మీది మీరు చూస్కోండి..? అని ఒక్క మాటతో తేల్చేశారట అధిపతులు..! చూశారుగా ఇదీ ప్రస్తుతం వైఎస్ జగన్ పరిస్థితి..!
గల్లీనే లేదు.. ఇక ఢిల్లీనా..!
గల్లీలోనే లేదు.. అదేనండోయ్ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని పరిస్థితి వైసీపీది. ఇక ఎంపీలు అంటారా నలుగురంటే నలుగురే గెలిచారు.. ఇక రాజ్యసభ అంటారా ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే..! ఒక్క బిల్లుల విషయంలో తప్పితే వీరితో పెద్దగా పనేముండదు..! అలాంటిది ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తామంటే ఎవరు మాత్రం లెక్క చేస్తారు చెప్పండి. ఏపీలో అరాచకం పెరిగిపోయిందని.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేయబోతున్నారు. బుధవారం నాడు జరగబోయే ఈ ధర్నాతో కేంద్రం దిగొచ్చి.. యావత్ ప్రపంచం తనవైపు చూడాలన్నది వైసీపీ కోరుకుటుందోట. అయితే.. 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్‌సభ ఎంపీలు, సుమారు 15 మంది దాకా రాజ్యసభ.. అరకొర ఎమ్మెల్సీలు మాత్రమే జగన్‌తో ఉన్నారు. కలిసొచ్చే పార్టీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపినప్పటికీ అబ్బే మాకెందుకు.. మీ బాధలు మీరు పడండని మొహాన్నే చెప్పేశారట. దీంతో ఒంటరిగానే పోరాడటానికి సిద్ధమైపోయారు జగన్.
కష్టమే జగన్..?
జగన్‌తో కలవడానికి కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, డీఎంకే, బీఆర్ఎస్ ఇలా చాలానే పార్టీలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎందుకంటే దీనికి చాలానే కారణాలున్నాయన్నది విశ్లేషకుల మాట. కాంగ్రెస్‌ను ఎదిరించి బయటికొచ్చిన జగన్.. ఇప్పుడు అవసరానికి రమ్మంటే ఎలా సపోర్టు చేస్తుంది అస్సలు చేయదు గాక చేయదు. బహుశా మద్దతు అడిగే ప్రయత్నం కూడా వైసీపీ చేయకపోవచ్చు. ఆప్ ఇండియా కూటమిలో ఉంది గనుక.. కాంగ్రెస్ మాట సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అస్సలు జవదాటరు. ఇక తృణముల్ కాంగ్రెస్ అయితే.. చంద్రబాబు మాట కాదని సపోర్టు చేసే పరిస్థితి లేదు. ఇక అన్నాడీఎంకే మద్దతివ్వొచ్చు కానీ కాంగ్రెస్‌తో కలిసున్న స్టాలిన్.. హైకమాండ్‌ను కాదని ఇవ్వరు. ఇక ఉన్న బీఆర్ఎస్ అంటారా.. కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ మిత్రులే కానీ.. ఎందుకో ఇంతవరకూ ఎక్కడా మద్దతిస్తున్నట్లు కానీ.. ఇవ్వమన్నట్లు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా గులాబీ పార్టీకి రాజ్యసభ సభ్యులు తప్పితే.. లోక్‌సభ ఎంపీలు లేరు.. మద్దతిచ్చినా విమర్శలపాలవుతామనే ఉద్దేశంతో ఇవ్వకపోవచ్చు కూడా.
ఎందుకిలా..?
వాస్తవానికి వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. బీజేపీతో ఎంతలా అంటకాగారన్నది సభ్య సమాజానికి బాగా తెలుసు. కేంద్రం కేసుల నుంచి జగన్ అండ్ కో పార్టీని కాపాడితే.. వైసీపీ మాత్రం బిల్లుల ఆమోదంలో రాజ్యసభలో మద్దతిస్తూ వచ్చింది. ఇలా కాషాయ పార్టీతో జర్నీ చేసిన జగన్‌కు.. ఇప్పుడు మద్దతివ్వాలని ఎవరినైనా కోరితే ఎందుకు మాత్రం ఇస్తారో చెప్పండి..! ఏదో నిన్న, మొన్నా కాంగ్రెస్-వైసీపీ దోస్తీ అన్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ.. సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మీడియా ముందుకొచ్చి తిట్టిన తిట్టు తిట్టుకుండా.. ఒంటికాలిపై లేస్తూ వైసీపీ, అన్న వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ధర్నా ప్రస్తావన తెచ్చి మరీ.. అసలు ఎందుకు చేస్తున్నారో..? ఎవరికోసం చేస్తున్నారో..? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయట్లేదు..? అని ఒక్కటే ప్రశ్నల వర్షం కురిపించారు. అలాంటిది షర్మిల మాటను కాదని.. హైకమాండ్ మద్దతిచ్చే పరిస్థితి ఉందా అంటే.. వందకు వెయ్యి శాతం లేదనే చెప్పుకోవాలి.
అయ్యే పనేనా అధినేతా..?
ఇవన్నీ ఒక ఎత్తయితే వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు మాత్రం ఇంకోరకంగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌తో విబేధించి కటీఫ్ చెప్పింది ఢిల్లీలోనే.. ప్రత్యేక హోదా అనే డిమాండ్ మొదలైంది ఢిల్లీలోనే.. ధర్నా చేసి సక్సెస్ అయ్యింది ఢిల్లీలోనే.. ఇలా అన్నీ సక్సెస్‌ఫుల్‌గా హస్తినలో జగన్ ముగించాడని.. అందుకే అచ్చొచ్చిన ఢిల్లీ నుంచే ఇప్పుడు శాంతి భద్రతలపై ధర్నాకు దిగుతున్నారు గనుక గ్రాండ్ సక్సెస్ అవుతామన్నది కార్యకర్తలు చెబుతున్న మాట. అయినా అన్ని వేళలూ ఒకటి కాదు కదా..! నాటి పరిస్థితులు వేరు.. నేటి పరిస్థితులు పూర్తిగా వేరన్నది అందరికీ తెలిసిందే. ఒకవేళ ఢిల్లీలో ధర్నా వర్కవుట్ కాకపోయినా కాస్తో.. కూస్తో మైలేజ్ అయినా వస్తుందని అభిమానులు చెబుతున్నారు. చూశారుగా.. కలిసొచ్చే పార్టీ లేదు.. తోట కూర కట్టా లేదు.. ఒంటరి పోరే తప్పు దిక్కెవరూ లేరు మరి..! ఘోర ఓటమిని చవిచూశాక జగన్ చేస్తున్న తొలి ప్రయత్నం ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూద్దాం మరి..!