స్వప్నాలకీ.. సత్యాలకీ మధ్య, చినుకులకీ.. ఆశలకీమధ్య, ఆహార నిరీక్షణలకీ.. ఆనందోత్సాహాలకీ మధ్య ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ కనకాల (Suma Kanakala), ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి (Tanikella Bharani), ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) చేసిన సందడి వందలమందిని ఆకర్షించి ఆకట్టుకుంది. చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అనే భాగస్వామ్యులు ప్రారంభించిన ఒక ఫుడ్ ఫెస్టివల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సుమ అక్కడి మహిళలతో, యువతీ యువకులతో చేసిన ఉత్సాహవంతమైన సందడి ఎంతోమందిని సంతోషంలో ముంచెత్తింది.
ప్రారంభం నుండీ కార్యక్రమం ముగింపు వరకూ సనసన్నని వాన చినుకుల మధ్య సుమ కనకాల చిరునవ్వుల పువ్వుల పరీమళాలు, చక్కర గుళికల్లాంటి పలుకులు ఆబాల గోపాలానికీ ఎంతెంతో ఉత్సాహాన్నిచించాయి. తరువాత.. జ్యూస్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ప్రఖ్యాత నటులు తణికెళ్లభరణి చమత్కారాలతో.. కర్పూర గుళికల్లాంటి మాటలతో ఉత్తేజభరితంగా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలుత తనికెళ్ళ భరణి నిండైన గాంభీర్యంతో దైవీయ భావనతో శ్రీ మహా గణపతి విగ్రహం ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ కార్యక్రమంలో పరమ ఉత్సాహంగా రసజ్ఞులందరి మనస్సునూ తన వినయ పవిత్రతలతో, ప్రతిభావంతమైన పలుకులతో ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఆకర్షించడం ఒక ప్రత్యేకంగానే చెప్పాలి. శ్రీనివాస్ ఇన్ని గ్రంధాలు పరమాద్భుతంగా రచించి, సంకలనీకరించి అందించినా, ఎన్నో వేదికలపై అద్భుత ప్రసంగాలిచ్చినా.. ఎక్కడా భేషజాలకు పోకుండా నిరాడంబరంగా ఉండి ఈ కార్యక్రమం జయావహం కావడంలో ప్రధానపాత్ర వహించడాన్ని పలువురు చర్చించుకోవడం గమనార్హం.
సుమ కనకాలకు పురాణపండ శ్రీనివాస్ పరమ శివుని మంగళమయ జ్ఞాపిక అందించగా.. నిర్వాహకులు భరణి ని కూడా శివానుగ్రహముగా ఈశ్వర జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎక్కువ మంది పాల్గొనడం గమనార్హం.