ఇదేంటి.. ఈ ఇద్దరు బద్ధ శత్రువులు కదా.. ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారు కదూ..! అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఇందుకు ఏపీ అసెంబ్లీనే సాక్ష్యం..! సోమవారం నాడు అసెంబ్లీ బయట, లోపల అంతా వాడివేడిగానే నడిచింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగం ఎంతో శ్రద్ధగా విని.. దానిపై చర్చ జరుగుతుందని అనుకుంటే అర్ధాంతరంగా ముగిసిపోయింది.! ఎందుకంటే అసెంబ్లీ పోయే దారులు మొదలుకుని.. గవర్నర్ ప్రసంగం వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రచ్చ రచ్చే చేశారు. ఐతే ఇంత గొడవలోనూ అసెంబ్లీ హాలులో మాత్రం ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ ఒక్క సీన్ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.
హాయ్ జగన్ అంటూ..!!
అసెంబ్లీ హాలులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఒకరికొకరు ఎదురయ్యారు. వెంటనే.. హాయ్ జగన్ అంటూ చేయి కలిపారు ఎమ్మెల్యే. ఆ తరవాత భుజంపై చేయి వేసి కాసేపు రఘురామ మాట్లాడారు. సుమారు 5 నిమిషాలపాటు ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. దీంతో.. మాజీ సీఎం వెంట ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కాసేపు పక్కకు వెళ్ళిపోయారు. ఇద్దరి మీటింగ్ తర్వాత మళ్ళీ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మరోవైపు.. ఇదంతా జగన్ చెవిలో ఆయన చెప్పారని, దాంతో మాజీ సీఎం ఆగ్రహంతో ఊగిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక చూస్తారుగా..!
రోజూ అసెంబ్లీకి రండి అని జగన్ రెడ్డిని రఘురామ కోరారు. ఇందుకు జగన్ బదులిస్తూ.. రెగ్యులర్ వస్తాను.. నేనేంటో మీరే చూస్తారుగా అని చెప్పారు. ప్రతిపక్షం లేకపోతే ఎలా..? అందుకే రోజూ అసెంబ్లీకి రావాలని మరోసారి రఘురామ కోరి.. ఈ క్రమంలో మళ్ళీ జగన్ చేతిలో చేయి వేసి మరీ ఆయన మాట్లాడారు. ఇంతటితో ఇద్దరి మధ్య సంభాషణ ముగిసినది. ఈ సన్నివేశంతో అటు టీడీపీ.. ఇటు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.. ఇంకొందరు ఐతే.. ఎంతైనా ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకున్న వ్యక్తి కదా.. కలిసి మాట్లాడటంలో తప్పేమీ లేదుకదా అని చెప్పుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చగా అయ్యింది.
జగన్ పక్కనే కావాలి..!
ఇదిలా ఉంటే.. ఇకపై తాను వైఎస్ జగన్ పక్కనే కూర్చుంటా అని మంత్రి, అసెంబ్లీ వ్యవహారాలు చూసే పయ్యావుల కేశవ్ ను రఘురామ కోరారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మంత్రి. కాగా.. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రఘురామకు విష్ చేశారు. ఈ ఆసక్తికర సన్నివేశాలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమొక్రసీ అంటూ ప్లకార్డులతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ నినాదాల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగి.. మంగళవారానికి వాయిదా కూడా పడింది.