బిగ్‌షాట్‌ల చూపు.. టీడీపీ వైపు!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా వైసీపీని వీడటం మొదలుపెట్టారు..! ఇప్పటికే ఒకరిద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన తీర్థం పుచ్చకోగా.. ఈసారి ఏకంగా ఇద్దరు బిగ్‌షాట్‌లే వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.! ఈ ఇద్దరు వీడితే ఇక ఆ జిల్లాలో పార్టీ పట్టుకోల్పోతుందని రాజకీయ విశ్లేషకుల మాట. ఇంతకీ ఎవరా ఇద్దరు..? ఆ జిల్లా ఏది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు సంగతి!
ఉమ్మడి విశాఖపట్నంలో వైసీపీకి మంచి పట్టు ఉంది. ఇదంతా టీడీపీ నుంచి వచ్చిన నేతల వల్లే..! ముఖ్యంగా అవంతి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్ వల్లేఅన్నది జగమెరిగిన సత్యమే..! పదవుల కోసం టీడీపీకి టాటా చెప్పి వైసీపీలోకి రావడం.. అవంతి మంత్రి పదవి అనుభవించడం.. ఇప్పుడు మళ్లీ పదవులు లేకపోయే సరిగి తిరిగి సొంతగూటికి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నారట. టీడీపీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు సైకిలెక్కి సవారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లాకు చెందిన ఒకరిద్దరు పెద్దల ద్వారా కబురు పంపారట.
ఎందుకంటే..?
అవంతి శ్రీనివాస్‌కు విద్యా సంబంధమైన వ్యాపారాలున్నాయి. వాటికి అండదండలు కావాల్సిందే.. అందుకే ఇక వైసీపీని వదిలి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. ఇక వాసుపల్లి అయితే.. వ్యాపారాలు, ఆస్తుల రక్షణ, పదవి కోసం సొంత గూటికి వెళ్లడానికి సిద్ధమయ్యారట. జిల్లాలో ఇద్దరూ బిగ్ షాట్‌లే. రాజకీయంగా, ఆర్థికంగా బాగున్నవారే. ఈ ఇద్దరూ జంప్ అయితే మాత్రం జిల్లాలో దాదాపు ఖాళీ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. వాస్తవానికి అవంతి అంటే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అస్సలు పడదు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను కాదని ఈయన్ను చేర్చుకుంటారా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే టీడీపీని వీడిన, వైసీపీ నేతలను ఆఖరికి సిట్టింగ్‌లను చేర్చుకునే ప్రసక్తే లేదని పరోక్షంగా టీడీపీ హైకమాండ్ సంకేతాలు పంపింది కూడా.
మౌనానికి అర్థమిదే..!
వైసీపీ ఓడిపోయినప్పట్నుంచీ అవంతి, వాసుపల్లి ఇద్దరూ మీడియా ముందుకు వచ్చిన దాఖలాల్లేవ్. ఆఖరికి రుషికొండ ప్యాలెస్, ఎర్రమట్టి దిబ్బలపై పెద్ద రాద్ధాంతమే జరిగినా కనీసం నోరు మెదపలేదు. ఇందుకు కారణం ఇప్పుడు అనవసరంగా మాట్లాడి రేపొద్దున్న ఇబ్బందులు పడటం కంటే మౌనంగా ఉండటమే మంచిదని భావించినట్లుగా సమాచారం. ఎంపీ విజయసాయిరెడ్డి వల్లే అవంతికి మంత్రి పదవి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాంటిది సాయిరెడ్డి-శాంతిల వ్యవహారం కుదిపేస్తున్నా.. ఆఖరికి వైజాగ్ వేదికగా ఎంపీ మీడియా మీట్ పెడితే అక్కడికి కూడా రాకపోవడం గమనార్హం. పైగా మాజీలు, ముఖ్యనేతలు జగన్‌ను వచ్చి కలుస్తున్నప్పటికీ ఈ ఇద్దరూ మాత్రం కనీసం తాడేపల్లికి వచ్చి అధినేతను కూడా కలవలేదు. అర్థమైంది కదా ఈ ఇద్దరి మౌనానికి అర్థమేంటో..!