జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముప్పు పొంచి ఉంది.. ఆయనపై భారీ కుట్ర జరుగుతోంది.. ఈ విషయాన్ని ముందుగానే కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి..! ఇవీ గత 48 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న, కనిపిస్తున్న వార్తలు. దీంతో ఒక్కసారిగా జనసైనికులు, మెగాభిమానులు, మెగా కుటుంబం ఉలిక్కిపడింది. అసలేం జరుగుతోంది..? ఎందుకిలా..? అని ఆందోళన చెందుతున్న పరిస్థితి.
ఏమైంది.. ఎందుకిలా..?
పవన్‌పై భారీ కుట్ర జరుగుతోంది.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. సేనాని అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సంస్థలు హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా, సాధారణ గ్రూపుల్లో పవన్ ప్రస్తావన వచ్చిందని.. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. పవన్‌ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి..? అనేది స్పష్టంగా చెప్పలేమని నిఘా వర్గాలు తెలిపాయి. కానీ.. డిప్యూటీ సీఎం తన భద్రత పట్ల పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశాయి. ఈ హెచ్చరికలతో జడ్ ప్లస్ సెక్యూరిటీని పవన్ కోరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఏమై ఉండొచ్చు..!
చెప్పినట్లుగానే వైసీపీని అధ:పాతాళానికి తొక్కిపడేశారు పవన్. దీంతో సేనానిపై ఆ పార్టీ శ్రేణులు, నేతలు కోపం పెంచుకుని ఉండొచ్చన్నది ఇన్‌సైడ్ టాక్. ఆయన గురించి సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతూ ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టులు సైతం హెచ్చరిస్తూ పలుమార్లు లేఖలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ నక్సల్స్ నుంచి కూడా ఏమైనా ముప్పు పొంచి ఉన్నా ఉండొచ్చని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయినా.. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్ ప్లస్ సెక్యూరిటీతో తిరుగుతున్నారు. అలాంటిది ప్రభుత్వంలో ఉన్న, ఇలాంటి ముప్పు ఉన్న వ్యక్తులకు భద్రత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సెక్యూరిటీ కలిపిస్తాయో చూడాలి మరి.