జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అటు ఓ వర్గం మీడియా.. ఇటు సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారా..? రోజుకో వార్త రాయిస్తూ.. పవన్ చేతులు కట్టేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది అని జనసైనికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంతకీ పవన్‌పై జరుగుతున్న కుట్ర ఏమిటి..? చంద్రబాబు ఎందుకిలా చూస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.
అసలేం జరుగుతోంది..?
పవన్ నోరు తెరిస్తే ఫైర్ బ్రాండ్‌లా మాటల తూటాలు పేలేవి..! ఎన్నికల ముందు.. ఆయన మాట్లాడిన మాటలు, కౌంటర్లు, విమర్శలు ఆ లెక్కే వేరు. అసలు శాంతి భద్రతలు అంటే ఎలా ఉంటాయనేది అధికారమిస్తే చేసి చూపిస్తామని.. తొలుత సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని మాటిచ్చారు. ఇక ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే లోలోపలే భయపడిపోవాలన్నట్లుగా చేస్తామని కూడా పెద్ద పెద్ద శపథాలే చేశారు సేనాని. అయితే అధికారంలోకి వచ్చాక ఆ ఫైర్ ఏమైంది..? ఎన్నికల ఫలితాలు మొదలుకుని ఇప్పటి వరకూ ఎన్నో గొడవలు, మరెన్నో హత్యలు.. అంతకుమించి అత్యాచార ఘటనలు.. నడిరోడ్డుపై నరుక్కుంటున్నా సరే కనీసం పవన్ ఎందుకు నోరు మెదపట్లేదు..? పవన్ నోరు మూయించారా..? లేకుంటే ఏమీ చేయలేకపోతున్నాననే మదనపడుతున్నారా..? అనేది తెలియక జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే పవన్ చెప్పిన భారీ డైలాగులను గుర్తు చేసి మరీ నెటిజన్లు, సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారంటే.. ఎలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎందుకిలా..?
కూటమి గట్టడానికి.. అధికారంలోకి రావడానికి కర్త, కర్మ.. క్రియ పవన్ కల్యాణే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజం..! ఒకవేళ పవన్ అనే వ్యక్తి ఒంటరిగా పోటీచేసి ఉంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండేది ఇది జగమెరిగిన సత్యమే..! అలాంటిది పవన్‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ వెనుక గోతులు తవ్వుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదెలాగంటే.. టీడీపీ అనుకూల పత్రికల్లో వెటకారంగా కార్టూన్ వేయించడం, మరుసటి రోజు వైజాగ్‌లోని భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల ఇష్యూపై పవన్ నాడు హడావుడి చేసినవే ఇప్పుడు ఇలా ఉన్నాయని పేరు ప్రస్తావించడంతో జనసైనికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిన్న కార్టూన్.. ఇవాళ ఇలా వార్తా..? అసలేం జరుగుతోంది..? ఎందుకిలా గోతులు తవ్వుతున్నారని మండిపోతున్నారు నేతలు.
సీబీఎన్ ఇది సబబేనా..?
వాస్తవానికి ఏపీ కేబినెట్‌లో వరుస రివ్యూలు, సత్వర పరిష్కారాలు చూపడంలోనూ పవన్ కల్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు..! చాంబర్లు కేటాయించిన మరుసటిరోజే బాధ్యతలు స్వీకరించడం, రంగంలోకి దిగిపోవడం 09 గంటలు సమీక్షలు చేసిన రోజులున్నాయ్. ఇంకా.. పంచాయతీ నిధులు, ఎర్రచందనం అక్రమ రవాణా.. ఇలా ఒకటా రెండా అసలు పవన్ సమీక్ష అంటేనే అధికారులు బెంబేలెత్తిపోయేలా చేశారు. అలాంటిది.. ఈయనకు మంత్రుల్లో మంచి ర్యాంకు, అది కూడా కనీసం టాప్ 5లో కూడా సీఎం చంద్రబాబు ర్యాంక్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇది పవన్‌ను అవమానించినట్లు కాదా..? ఈ క్రమంలోనే ఆయన దగ్గరున్న శాఖల్లో కొన్ని విభాగాలను తప్పించి మంత్రి సుభాష్‌కు ఇవ్వడంలో ఆంతర్యమేంటి..? అనే ప్రశ్నలు జనసైనికుల నుంచి వస్తున్నాయి.
డిప్యూటీ అక్కర్లేదా..?
కూటమి గెలిచిన తర్వాత ఢిల్లీకి ఆ తర్వాత ప్రమాణ స్వీకారంలో తప్ప ఈ ఇద్దరూ ఎక్కడైనా కనీసం కలిసి (అధికారిక కార్యక్రమాల్లో) కనిపించారా..? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ జరిగినప్పుడు పవన్ ఎక్కడున్నారు..? బాబు ఎందుకు వెంట తీసుకెళ్లలేదు..? ఇప్పటి వరకూ రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వెంట పవన్ లేరేం..? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రశ్నలు సేనాని అభిమానులు, కార్యకర్తల్లో వస్తున్నాయి. అంతేకాదు.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో చూస్తున్నాం కదా.. అలాగే పవన్‌కు ఎందుకివ్వట్లేదు..? ఎందుకు విస్మరిస్తున్నారు..? అనేది పెరుమాళ్లకే తెలియాలి.
ఏమైంది ఆ ఫైర్..?
పవన్ అంటే ఓ ఆవేశం.. ఓ ఫైర్ అని అభిమానులు చెబుతుంటారు..! అదేనండోయ్.. ఎక్కడైనా తప్పు జరిగితే, ప్రధానంగా మహిళల రక్షణ విషయంలో సేనాని ఆలోచన వేరే లెవెల్ అని అంటుంటారు..! ఎక్కడ అక్రమం, దారుణం జరిగినా పవన్ సీరియస్‌గా రియాక్ట్ అవుతారని కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫైర్, ఆవేశం ఏమైంది..? పసికందు మొదలుకుని పండు ముదుసలి వరకూ అత్యాచారాలు జరుగుతున్నా.. నడిరోడ్డుపై నరికేస్తున్నా.. విచక్షణ మరిచి రాజకీయ పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నా పవన్ ఎందుకు మిన్నకుండిపోయారు..? ఆయన చేతులు నిజంగానే కట్టేశారా..? లేకుంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో పవన్ ఉన్నారా..? అనేది సేనానికే తెలియాల్సి ఉంది. రేపొద్దున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. పూర్తిగా జనసేన, అవసరమైతే బీజేపీ పార్టీలను పక్కనెట్టి టీడీపీనే పాలన సాగించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.. ఎందుకంటే అలాంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయ్..! ఏమో.. ఏమైనా జరగొచ్చు.. ఎవరికి ఎరుక..!