ఆంధ్రప్రదేశ్‌లో ఏమిటీ నేరాలు, ఘోరాలు.. రోజుకో దాడి.. రెండ్రోజులకో హత్య, మూడ్రోజులకే రేప్.. ఎందుకిలా..? మీడియాలో చూసినా.. సోషల్ మీడియాలో చూసినా ఏపీలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలే దర్శనమిస్తున్న పరిస్థితి..! పసిపాప మొదలుకుని పండు ముదుసలి వరకు.. ఆఖరికి మూగ జీవులను సైతం వదలని కామాంధులు ఉండటం సిగ్గుచేటు..! ఇవన్నీ ఒక ఎత్తయితే పంథాలు, పట్టింపులకు వెళ్లి టీడీపీ, వైసీపీ, జనసేన కార్యకర్తలు కొట్టుకోవడం మరో ఎత్తు. కొట్లాట వరకేనా అంటే హత్యల వరకూ వెళ్తుండటం గమనార్హం..! ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఆంధ్ర రాష్ట్రమా ఓ అనాథలా ఒంటరి అయ్యావా..? అంటూ సాటి మనిషిలో మెదులుతున్న ప్రశ్న.
ఏం జరుగుతోంది..?
పసి కందుల ప్రాణాలు మాడి మసి అవుతుంటే.. ఆడబిడ్డల ఆక్రందనలు వినే నాథుడే లేకుంటే.. మానవత్వం మనిషితత్వం మచ్చుకైనా కానరాకుంటే.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కరువవుతుంటే..? పాలకులు పాలన గాలికొదిలేసి సంబరాల్లో తేలుతుంటే.. ఆవేశంతో ఉగిన నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతుంటే.. వత్తాసు పలికిన కుహనా మేధావులు అత్తా పత్తా లేకుంటే.. అధికారులు చేష్టలుడిగి దిక్కులు చూస్తుంటే.. ప్రశ్నించాల్సిన పత్రికలు ఈ పాపాలలో వాటాలు పంచుకుంటుంటే..? కాపాడే నాథుడే లేక.. రాష్ట్రమా ఓ అనాథలా ఒంటరి అయ్యావా..? అనే సందేహాలు ఏపీ జనాల్లో వస్తు్న్నాయ్. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ వెలుగు చూస్తున్నాయ్.. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదే ఏమో..!
దేవుడా.. ఇన్నా..?
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే మొదలైన గొడవలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 1,050 దౌర్జన్య దాడులు, 300 హత్యాయత్నాలు, 31 హత్యలు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 35 వేధింపులు తాళలేక ఆత్మహత్యలు, గ్రామాలు విడిచి వెళ్లిపోయిన కుటుంబాలు 2,705.. 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఘటనలు, ఒక్క పల్నాడు జిల్లాలోనే 1500 కుటుంబాలు దాడులకు తట్టుకోలేక తెలంగాణకు వెళ్లిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందనే అర్థం చేసుకోవచ్చంటూ వైసీపీ ఓ లెక్కల చిట్టాను బయటికి తీసింది. ఇక అత్యాచార ఘటనలు అయితే లెక్కే లేకుండా పోయింది..! ఈ వరుస ఘటనలతో ఆంధ్రప్రదేశ్ కాస్త అత్యాచారంధ్రప్రదేశ్, హత్యాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
ఎక్కడున్నాం..?
అయినా రాజకీయ పార్టీలు, నేతల కోసం ప్రాణాలు తీసుకోవడం ఏంటి..? అసలు మనం రాతి యుగంలో ఉన్నామా..? లేకుంటే బిహార్‌లో ఉన్నామా..? అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. దాడులు, హత్యలు చేసుకుంటే.. సచ్చినోడు కాటికి, నరికినోడు జైలుకు పోతాడు.. ఆట ఆడించినోడు మాత్రం కుర్చీలోనే ఉంటాడు కదా..? అనే విషయం మరిచిపోయి మెలిగితే ఎలాగా..?. పార్టీలు, అధికారం అనేవి ఇవాళ ఉంటాయ్, రేపు పోతాయ్.. అంత మాత్రాన చంపుకోవడం, కొట్టుకోవడమేంటి..? చచ్చినోడి.. చంపినోడి కుటుంబాలు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాయ్.. అసలు ఈ రోధన కుటుంబాలకు ఎందుకు..? క్షణికావేశం వల్ల ఒరిగేదేముంది..? చంపుకుంటే పోతే ఎవరైనా మిగులుతారా..? మనమంతా మనుషులమనే విషయం మరిచి మృగాళ్లా బతికేస్తే ఎలా..?. పగలు, ప్రతీకారాలతో బతకడం కంటే ప్రేమతో.. ప్రేమించి బతకడం ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది సుమీ..!
ఏమైంది సారూ..!
ఇదిగో 1995లో చంద్రబాబును మళ్లీ చూస్తారని ఓ వైపు సీబీఎన్, మరోవైపు నారా లోకేష్ తెగ ఊదరగొట్టారు కదా..? ఆ చూడటం అంటే ఇప్పుడు జరుగుతున్న ఘటనలేనా..? టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారా.. అసలు సభ్య సమాజానికి ఏం సమాధానం ఇవ్వాలని ఇలా చేస్తున్నారు.. ఇంత జరుగుతున్నా ఆపకుండా సైలెంట్‌గా ఉన్నారో పెద్దలలకే తెలియాల్సి ఉంది. అయినా ప్రతి దానికీ శ్వేత పత్రాలు అంటున్న చంద్రబాబు సర్కార్.. కాస్త అవి పక్కనెట్టి శాంతి భద్రతలు చూడు సామీ అని కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు చేతులెత్తి వేడుకుంటున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చి మరీ తాట తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేథావులు చెబుతున్న మాట. ఈ నేరాలు, ఘోరాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఏంటో చూడాలి మరి.