వెనుంబాక విజయసాయిరెడ్డి.. వైసీపీ ఎంపీ, పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన నేత..! నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకూ అత్యంత విశ్వాసపాత్రుడు..! 2014-2019 మధ్యకాలంలో ఈయన పార్టీకి చేసిన కృషి అంతా ఇంతా కాదు..! వైసీపీ గెలుపులో కీలక పాత్ర ఈయనదే..! అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులపాటు.. పార్టీలో అటు అధినేతను కలిసినా కలవకపోయినా ఈయన ఒక్క మాట చెబితే పనులు నిమిషాల్లో ఐపోయేవి అని వైసీపీ నేతలు చెప్పుకునేవారు. ఏం జరిగిందో తెలియదు కానీ జగన్ రెడ్డి.. సాయి రెడ్డికి అమాంతమైన గ్యాప్ వచ్చేసింది. అధికారంలో ఉన్నప్పుడు జగన్ సమావేశాల్లో తప్ప ఎక్కడా పెద్దగా కనిపించలేదు.. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డి అని వైసీపీ కార్యకర్తలే చెబుతుంటారు.
అసలేం జరుగుతోంది..?
సజ్జల ఎంట్రీతో నాటి నుంచి నేటివరకు సాయిరెడ్డి ఒంటరిగానే తన పనేదో తాను చేసుకుని పోతున్నారు..! ఆఖరికి తన వ్యక్తిత్వంపై ప్రత్యర్థులు దెబ్బ కొడుతున్నప్పటికి ఒంటరిగానే పోరాటం చేస్తున్న పరిస్థితి. సాయిరెడ్డి - శాంతి మధ్య ఏదో సంబంధం ఉందని, ఆమెకు పుట్టిన బిడ్డకు ఈ పెద్ద మనిషే కారణం అని భర్త మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చి దుమ్ము దులిపేసి వెళ్తున్నారు. ఈ వ్యాఖ్యలకు కూడా ఒక్కడై కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇది నిజమా..? అపద్దమా..? అనేది పక్కనెడితే కనీసం ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత మీడియా ముందుకు వచ్చి కానీ.. సోషల్ మీడియా వేదికగా కానీ స్పందించక పోవడం గమనార్హం. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక విజయసాయి తీవ్ర ఆవేదనకు లోనవుతున్నట్లు తెలిసింది.
ఇంకెన్నాళ్ళు ఇలా..?
నాడు సజ్జల దెబ్బకు పార్టీకి దూరమై.. ఇప్పుడు తనపై ఒక వర్గం మీడియా దుమ్మెత్తి పోస్తుంటే కనీస మద్దతు లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారట సాయిరెడ్డి. ఐతే.. వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఐతే మరోలా ఉంది. అసలే ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడినా సరే ఆయన ఫ్లాష్ బ్యాక్ మొత్తం వెతికి మరీ ఏదో ఒక రచ్చ చేస్తారని భయపడిపోతున్నారట. ముఖ్యంగా.. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని, రోజా లాంటి వారైతే వద్దు బాబోయ్ మాకు ఈ పంచాయితీ అని మిన్నకుండిపోతున్నారట. వాస్తవానికి ఇప్పుడు అంబటి, పేర్ని వైసీపీ తరఫున మీడియా ముందుకు ఏం జరిగినా సరే వాలిపోతున్నారు. అలాంటిది.. ఈ ఇద్దరి నోట కూడా సాయిరెడ్డి మాట రాలేదు. అంటే.. పార్టీ లోలోపల ఏం జరుగుతుందో..? ఎందుకు ఇలా చేస్తున్నారు..? సాయిరెడ్డిని ఇలా ఒంటరిని చేసి పార్టీ నుంచి బయటికి పంపాలని చేస్తున్నారా..? అన్నది వైసీపీ కార్యకర్తలకు అర్థం కానీ పరిస్థితి. ఈ సందేహాలను నివృతి చేసేది ఎవరో.. అది ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి మరి.