భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ టీటీడీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో సేవలు చేయాలని ఎవరి ఉండదు చెప్పండి..! అక్కడ వలంటీర్‌గా పనిచేయడానికి క్యూ కడుతుంటారు శ్రీవారి భక్తులు. అలాంటిది.. చైర్మన్ పదవి దక్కుతోందంటే అదో అదృష్టమే. ఆ సీటుకు ఎంతో విలువ, గౌరవం.. కేబినెట్ ర్యాంక్ ఉంటుంది..! ఈ పదవి కోసం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన.. టీడీపీ నుంచి పదుల సంఖ్యలో నేతలు రేసులో ఉన్నారు. ఆఖరికి ఈ పదవి ఎవరికి దక్కుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి.
అదృష్ట వంతుడెవరో..?
నిన్న మొన్నటి వరకూ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు ఈ పదవి ఇస్తున్నట్లు వార్తలు రావడం.. అబ్బే వద్దు బాబోయ్ అని తిరస్కరించినట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయ్. అయితే.. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు లైన్ క్లియర్ అయ్యిందని అమరావతి వర్గాల్లో ఒక్కటే చర్చ నడుస్తోంది. వాస్తవానికి వెంకన్న సన్నిధిలో పనిచేయడం ఆయన చిరకాల కోరిక. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా అభ్యంతరం లేదు కానీ.. శ్రీవారికి సేవ చేసుకునే అదృష్టం కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబును 2014 నుంచే అడుగుతూ వస్తున్నారు. అయితే కొన్ని సమీకరణల దృష్ట్యా ఇవ్వలేకపోయినప్పటికీ.. ఇప్పుడు ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారట. దీంతో.. దాదాపు మురళీ మోహన్‌కే లైన్ క్లియర్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశముంది.
రేసులో ఎంతమందో..?
బీజేపీ నుంచి జీవీఎల్ నర్సింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, భాను ప్రకాష్ రెడ్డి.. జనసేన నుంచి నాగబాబు.. టీడీపీ నుంచి అయితే లెక్కలేనంత మందే రేసులో ఉన్నారు. అయితే కేంద్రంలోని ఎన్డీఏ మాత్రం పూర్తిగా ఐదేళ్లు ఇవ్వకపోయినా ఫర్లేదు కానీ.. రెండున్నరేళ్లు మాత్రం ఇవ్వాల్సిందేనని గట్టిగా అడుతోందట. ఇక జనసేన అయితే.. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు తక్కువే.. గెలిచాక మంత్రి పదవులు కూడా అంతంత మాత్రమే కదా.. ఐదేళ్లు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనని అడుగుతున్నట్లు తెలిసింది. ఇక టీడీపీ నుంచి అంటారా.. జిల్లాకో నలుగురైదురు చొప్పున నేతలు ఉన్నారు. అయితే.. నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగానే టీటీడీ పోస్టులను భర్తీ చేస్తారని ప్రకటన రావడంతో.. ఈ పదవుల పంపకం ఎప్పుడు అవుతుందో.. ఆ అదృష్టం తమని వరిస్తుందో లేదో అని ఆశావహులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.