మాజీ మంత్రి, మాజీ ఎమ్యెల్యే రోజా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాను అనుకుంటుంది. కానీ అదే సమయంలో ఆమె అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కుంది. పారిశుద్ధ కార్మికుల్ని చూసి రోజా పెట్టిన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూసి రోజా పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన రోజా నోరు తెరిస్తే ప్రతిపక్షాలను అడ్డమైన మాటలతో ఒణికించడమే పని.
ఈ ఎన్నికలో రోజా ని సొంత పార్టీ వారే మోసం చేసి గట్టిగా ఇరికించారు, ప్రజలు ఆమెని అసెంబ్లీకి కూడా పంపించకుండా దారుణంగా ఓడించారు. మిమ్మల్ని అసెంబ్లీ గేటు దాటనివ్వము అన్నవారంతా ఇంట్లో కూర్చుంటే, అనిపించుకున్నారు మాత్రం పదవులని అనుభవిస్తూ రాజ పూజ్యం అందుకుంటున్నారు. ఇక ఓడిపోయాక కూడా జగన్ ని కలిసొచ్చి అప్పుడప్పుడు మీడియా ముందు కనిపించిన రోజా ఇప్పుడొక వివాదంలో ఇరుక్కుంది.
ఆమె తన భర్త సెల్వమణితో కలిసి తమిళనాడులోని ప్రముఖ మురుగన్ ఆలయమైన తిరుచెందూర్ ఆలయానికి వెళ్ళింది. అక్కడ పూజ కార్యక్రమాలను ముగించుకుని బయటికొచ్చిన రోజాతో అక్కడ ఆలయ సిబ్బంది ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అందులో భాగంగా పారిశుద్ధ కార్మికులు కూడా రోజా తో ఫోటో దిగేందుకు వచ్చారు.
అయితే ఆ పారిశుద్ద కార్మికుల్ని చూసి రోజా దూరంగా జరగమంటూ ఇచ్చిన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో సైగలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజెన్స్ పరిశుద్ధ కార్మికులేమైనా అంటరాని వారా.. రోజా కెందుకంత పొగరు, వారిని అంత అస్సహించుకోవాలా అంటూ రోజా పై ఫైర్ అవుతున్నారు.