కోట రుక్మిణి.. జనసేన నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేని పేరు..! ఎందుకంటే.. ఒకప్పుడు ఈ పేరు మార్మోగింది.. అంతకుమించి జనసేన శ్రేణులు వణికించింది కూడా..! ఒకరా ఇద్దరా రుక్మిణి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు..! ఒకానొక సందర్భంలో నాదెండ్ల మనోహర్‌ను కూడా పక్కనెట్టి రుక్మిణీకే.. పవన్ కల్యాణ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే చర్చలు కూడా నడిచాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పేరు వినిపించలేదు.. మనిషీ కనిపించలేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే అడ్రస్ లేరంతే..! ఆఖరికి కూటమి గెలిచి, పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడూ కూడా కనిపించలేదు.. కానీ సడన్‌గా సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు..! దీంతో బాబోయ్.. మళ్లీ వచ్చిందేంట్రా సామీ అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి..!
కోట మరిచిపోతే ఎలా..?
పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితురాలు కోట రుక్మిణి.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కృష్ణా జిల్లా వాసి అయిన రుక్మిణి విదేశాలకు వెళ్లి బ్రాండెడ్ షాపు నిర్వహిస్తూ సెటిల్ అయ్యారు. సేనానితో పరిచయం ఎలా ఏర్పడిందో తెలియదు కానీ.. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు షెడ్యూల్ మొత్తం చూసుకునేవారు. ఆమె సేవలను గుర్తించిన పవన్.. 2020లో రుక్మిణికి జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్ పదవీ బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది. అప్పుడే ఇక లండన్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. ఆమె వచ్చీ రాగానే.. నా మాటే శాసనం, చెప్పింది చేయాల్సిందే అన్నట్లుగా ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో వన్ అండ్ ఓన్లీ అనే నేను అన్నట్లుగా ప్రవర్తించారని.. పవన్ తర్వాత నేనే అని చెప్పుకునేవారట. అంతేకాదు పవన్‌ను కలవాలంటే ఎంత పెద్ద పాలెగాడైనా రుక్మిణిని దాటుకుని మాత్రమే వెళ్లాలని కండిషన్ పెట్టేవారట. ఎంతటివారైనా సరే డోంట్ కేర్ అనేసేవారట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప.. జనసేన ఆఫీస్ గేటు కూడా తాకలేరట. అలా రుక్మిణి కోట కట్టి.. కోటరీగా ఏర్పరుచుకుందట. ఇలాంటి బాధలు తట్టుకోలేక రాయలసీమ మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖలో 140 రోజులు తనను రుక్మిణి ఎలా ఆడుకున్నారో వివరించారు కూడా. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ లెక్కలేనన్ని ఉన్నాయ్. ఈ వరుస ఘటనల తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. అడ్రస్ లేకుండా పోయారు.
సచివాలయంలో దర్శనం!
నాడు అడ్రస్ లేకుండా పోయిన రుక్మిణి.. మంగళవారం నాడు సచివాలయం దగ్గర దర్శనమిచ్చారు. ఓ వైపు సచివాలయం లోపల కేబినెట్ సమావేశం జరుగుతుండగా.. సెక్రటేరియట్ బయట దర్శనమిచ్చారు..! సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. ఆమెను పోలీసులు, సచివాలయం సిబ్బంది తొలుత గుర్తు పట్టలేదు. దీంతో అడ్డుకుని ఎవరి తాలూకా.. ఎందుకొచ్చారు..? ఎవరికోసం..? అడగ్గా.. ఆమె ఎవరికో ఫోన్ చేయడం.. ఆ తర్వాత పవన్ చాంబర్ నుంచి ఫోన్ రావడంతో సచివాలయం లోపలికి పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లారు. అయితే.. పవన్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఛాంబర్ నుంచి ఆదేశాలు రావడంతో అనుమతించారని తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జనసేన కార్యకర్తలే ఈ వీడియోలు వైరల్ చేస్తూ తిట్టిపోస్తుండటం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మొత్తం కేబినెట్ భేటీ కంటే.. రుక్మిణి వ్యవహారమే బర్నింగ్ టాపిక్ అయ్యింది. అసలు ఆమెవరు..? ఎమ్మెల్యేనా..? ఎమ్మెల్సీనా..! పోనీ, సచివాలయ సిబ్బందా..? అంటే అదీ కాదు. మరి ఓ అజ్ఞాత మహిళకు ఏపీ సచివాలయంలో పనేంటి..? ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్. రుక్మిణి దర్శనంతో ఎక్కడ మళ్లీ పాతరోజులు వస్తాయో అని జనసేన కార్యకర్తలు, నేతలు హడలెత్తిపోతున్నారు. అయినా ప్రశాంతంగా ఉన్నప్పుడు రుక్మిణి ఎందుకు..? ఆమె అవసరం ఇప్పుడేముంది..? అని పవన్‌ను సొంత పార్టీ వాళ్లే ప్రశ్నిస్తున్నారు. పోనీ ఈసారైనా మారిన రుక్మిణిని కార్యకర్తలు చూస్తారా..? లేకుంటే తగ్గేదేలే అంటూ పాత కోటనే చూడాల్సి వస్తుందో చూడాలి మరి.