కిరణ్ అబ్బవరం.. చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా.. యంగ్ హీరోలలో మంచి టాలెంట్ ఉన్న హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తూ.. ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉండే కిరణ్‌కు ఈ మధ్య సరైన హిట్ పడనప్పటికీ.. అవకాశాల విషయంలో మాత్రం ఆయన వెనక్కి దిరిగి చూసుకోనవసరం లేకుండా.. వరుసగా చిత్రాలను ప్రకటిస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా ఆయన తన ‘SR కళ్యాణమండపం’ చిత్ర హీరోయిన్‌తో నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. నిశ్చితార్థం అయితే అయింది కానీ.. పెళ్లి ఎప్పుడనేదానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు.
ఈ క్రమంలో తాజాగా ఆయన ఫియాన్సీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. సోమవారం కిరణ్ అబ్బవరం పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఫియాన్సీ రహస్య గోరక్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో కిరణ్‌కు, తనకు పెళ్లి ఎప్పుడనే విషయాన్ని చాలా చక్కగా తెలిపింది రహస్య. కిరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. అప్పటి వరకు కిరణ్‌తో ఉన్న అనుభవాలను రహస్య ఫొటోల రూపంలో ఓ వీడియోగా షేర్ చేసింది.
ఆ వీడియోకి ‘హ్యాపీ బర్త్‌డే కిరణ్.. మరో 38 రోజుల్లో నిన్ను మై హస్బెండ్ అనేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా.. ’ అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్‌తో వారిద్దరి వివాహానికి ఇంకా 38 రోజులు (సోమవారం నాటికి) మాత్రమే ఉందనే విషయం వెల్లడైంది. ఆమె రివీల్ చేసిన మ్యాటర్ ప్రకారం.. కిరణ్, రహస్యల వివాహం ఆగస్ట్ 21న జరిగే అవకాశం ఉంది. మొత్తంగా అయితే రహస్య తన పెళ్లి డేట్‌ని రివీల్ చేసిన తీరుకు.. అంతా ఆమెను అభినందిస్తున్నారు. కిరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘క’ అనే పాన్ ఇండియా సినిమా పనిలో నిమగ్నమై ఉన్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.