ప్రస్తుతం టాలీవుడ్ గురించి ప్రపంచ సినిమా చెప్పుకుంటోంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి.. వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఈ సినిమాలకే కాకుండా ఇందులో నటించిన హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఆ గుర్తింపుతోనే.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆర్గనైజర్స్ తెలుగు హీరోలకు కూడా తగిన గుర్తింపును ఇస్తున్నారు. ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీలకే పరిమితమైన ఈ గౌరవం.. ఇప్పుడు తెలుగు హీరోలకు సైతం దక్కుతుండటంతో వారి అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.
ఇక విషయంలోకి వస్తే.. ఇప్పటి వరకు ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారికి ఉన్న అరుదైన గౌరవం.. ఇప్పుడు రామ్ చరణ్‌ని కూడా వరించింది. అవును, లండన్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌కి ఉన్న పాపులారిటీ, ఫాలోయింగ్‌ను తెలుసుకున్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు.. వెంటనే ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అయినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
మరో విశేషం ఏమిటంటే.. రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పీ రైమ్‌ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతుండటం. ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన రైమ్‌ని రామ్ చరణ్ ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లైట్స్, కారు.. ఏదైనా సరే, రామ్ చరణ్ పక్కన రైమ్ ఉండాల్సిందే. అంతిష్టం రైమ్ అంటే రామ్ చరణ్‌కి. అందుకే రైమ్‌ని పట్టుకుని ఉన్న రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. రామ్ చరణ్ ఇష్టానికి కూడా గౌరవం ఇవ్వబోతున్నారట మ్యూజియం వాళ్లు. ప్రస్తుతం ఇదే విషయమై కొలతలు ఇచ్చేందుకు రామ్ చరణ్ లండన్ వెళ్లినట్లుగా సమాచారం.