అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన ముహుర్తమే బాగాలేదనుకుంటా. ఎందుకంటే, ఆయనకు ఇంత వరకు సరైన హిట్ పడలేదు. ఇప్పుడాయన ఏ సినిమా చేస్తున్నాడో కూడా క్లారిటీ లేదు. అఖిల్ లాస్ట్ మూవీ ‘ఏజంట్’ వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ సినిమా తర్వాత.. అదిగో, ఇదిగో అంటూ కొందరు డైరెక్టర్ల పేర్లు వినబడటమే కానీ.. ఎవరితోనూ సినిమా ఫైనల్ కాలేదు.. అనౌన్స్‌మెంటూ రాలేదు. ఒక స్టార్టింగ్ హీరో అందునా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకునే ఓ ఫ్యామిలీకి చెందిన హీరో పరిస్థితి ఇలా అవడమేంటో అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా అఖిల్.. ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుకలో కనిపించాడు. ఆ వేడుకలో అఖిల్ మేకోవర్ చూసిన వారంతా.. ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారనేలా మాట్లాడుకుంటున్నారు. అయితే ఎంత త్వరగా అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే అంత మంచిదని అక్కినేని అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.
ఇదిలా ఉంటే.. అఖిల్ చేసిన లాస్ట్ సినిమా ఏజెంట్ ఓటీటీ విడుదల విషయంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ చిత్ర నిర్మాతకు ఉన్న ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఇంత వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాలేదు. రెండు మూడు సార్లు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు.. కానీ జరగలేదు. దీంతో అంతా ఈ ‘ఏజెంట్’ సినిమాని మరిచిపోయారు.
మళ్లీ ఒక వారం నుంచి సోషల్ మీడియాలో ఈ ఏజెంట్ సినిమాకు సంబంధించి టాక్ వైరల్ అవుతుండటం విశేషం. అదేంటంటే.. ఈ సినిమా ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా టీవీలో ప్రసారం కానుందని. ట్విస్ట్ ఏంటంటే అది తెలుగులో కాదు.. బాలీవుడ్‌కు చెందిన గోల్డ్‌మైన్స్ టీవీ ఛానల్ ఈ సినిమాను జూలై 28న రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. అంతే.. మళ్లీ ఏజెంట్‌పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.