అవునా.. అంబానీ పెళ్లిలో చర్చా.. అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండోయ్ మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! ఈ మాట చెప్పిందెవరో కాదు స్వయానా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే..! సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం ముంబై వెళ్లి.. దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్‌ల వివాహ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. వేడుకలో ప్రత్యేకంగా అంబానీ ఆహ్వానించి.. ఇరువురితో చేతులు కూడా కలిపారు. సేనాని రాకను గమనించిన అతిథులు, సినీ, రాజకీయ ప్రముఖులు.. పవన్ గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనికి తోడు చిత్ర విచిత్రాల డిజైన్లలో నటీనటులు, వివిధ రంగాల ప్రముఖలు విచ్చేయగా.. పవన్ మాత్రం వారాహీ మాలలోనే హాజరయ్యారు. ఇది కూడా చర్చకు దారితీయడానికి ఒక కారణం.
ఇదీ అసలు కథ..!
వేడుక ముగిశాక అమరావతికి వచ్చిన పవన్ కల్యాణ్.. జనసేన ప్రజాప్రతినిధుల సత్కార సభలో పాల్గొన్నారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమై అందర్నీ అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన సేనాని.. జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచిందని.. ఈ విషయాన్ని అంబానీ పెళ్లిలో కూడా చర్చించుకున్నారు.. తనను కూడా అడిగారన్నారు. జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ అనేది దేశంలో ఓ కేస్ స్టడీ అయిందని పవన్ చెప్పుకొచ్చారు. జనసేన విజయం గొప్ప విజయమని.. బహుశా జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే తట్టుకోలేకపోయేవారేమో అని సేనాని చెప్పారు.
ఎక్కడ చూసినా..?
వాస్తవానికి.. కూటమి కట్టడం మొదలుకుని గెలుపు వరకూ పవన్ పాత్ర ఇప్పటికే కాదు ఎప్పటికీ మరిచిపోలేనిది. అందుకే.. సీఎం చంద్రబాబు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాలను తీసుకున్న జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు.. అది కూడా అధినేత గెలవని పరిస్థితి నుంచి అందర్నీ గెలిపించుకున్నారే ఇదీ అసలు సిసలైన కిక్కించే విషయం. పైగా ఎక్కడ తెలుగు వాడున్నా.. ఎప్పుడు పవన్ కనిపించినా.. ఆయన వాయిస్ వినిపించినా జనసేన గురించి చర్చకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి..! ముంబైలో అంబానీ పెళ్లికి వెళ్లగా అక్కడ కూడా చర్చించారంటే ఇది నిజంగా మామూలు విషయం కానే కాదు. మొత్తానికి చూస్తే.. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా జనసేన గురించే చర్చ జరుగుతోందన్న మాట. పవన్ కరెక్ట్‌గానే ఉన్నారు సరే.. గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు.. కార్యకర్తలు.. ఇతరా నేతలు సక్రమంగా ఉంటేనే అదే పదివేలు మరి..!