వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డిని పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారా..? సొంత మనుషులే ఇబ్బంది పెడుతుండటంతో తీవ్ర మనోవేదనకు ఆయన గురవుతున్నారా..? పార్టీ పరంగా.. వ్యక్తిగతంగా సొంత మనుషులే ఇబ్బంది పెడుతుండటంతో ముందుడుగు వేసి కీలక నిర్ణయం తీసుకున్నారా..? అంటే ఒక్క ప్రెస్‌మీట్‌తో వీటన్నింటికీ సమాధానాలు దొరికాయ్.. ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలిసిపోయాయ్ కూడా..! అంతలా సాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు..? ఎందుకింత రచ్చ జరుగుతోంది..? నిజంగానే వైసీపీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!
అసలేం జరుగుతోంది..?
విజయసాయిరెడ్డి.. వైఎస్ నుంచి వైఎస్ జగన్ వరకూ ఎంత నమ్మకంగా ఉన్న వ్యక్తి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందుకు మాజీ సీఎం కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి.. ఇంచుమించు పార్టీలో తనతో సమానంగా చూసుకున్నారు. దీంతో మరింత విశ్వాసం చూపించిన సాయిరెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాంటిది ఏం జరిగిందో తెలియదు కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత ఒక్కసారిగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా సజ్జల రామకృష్ణారెడ్డే కనిపించేవారు.. వినిపించేవారు..! దీంతో పార్టీలో ఉన్నారంటే ఉన్నారన్నట్లుగా వ్యవహరించేవారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సి రావడం.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అసలే అటు పార్టీ.. ఇటు ఎంపీగా ఓడిపోయాననే బాధలో ఆయనుంటే శాంతి అనే మహిళ వ్యవహారంతో మనశ్శాంతి లేకుండా పోయింది.
ఎవర్నీ వదలను..!
తన భార్య శాంతి గర్భానికి విజయసాయిరెడ్డే కారణమని మదన్ మోహన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. దీంతో ఎట్టకేలకు మీడియా ముందుకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అది కూడా తనను సంప్రదించకుండా కించపరుస్తూ.. వ్యక్తిగతం దెబ్బకొట్టిన టీవీ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్.. దినపత్రికలను పేర్లతో చెప్పి చురకలంటించారు. అంతేకాదు.. ఆయా చానెల్స్ యజమానులు, డిబేట్స్ చేసిన వారి బాగోతాలను సైతం బయట పెట్టారు. పనిలో పనిగా సొంత పార్టీలో ఇబ్బంది పెడుతున్న.. ఈ వ్యవహారంలో తలదూరుస్తున్న వారిని సైతం హెచ్చరించారు. అయితే దీనంతటికీ కర్త, కర్మ.. క్రియ సజ్జల రామకృష్ణారెడ్డేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సొంత పార్టీ కార్యకర్తలే చర్చిస్తుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సాయిరెడ్డి పార్టీలో కొనసాగడం కూడా కష్టమేనని తెలుస్తోంది.
ఇక తగ్గేదేలే..!
చాలా రోజులుగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సాయిరెడ్డి.. వచ్చీ రాగానే బరస్ట్ అయిపోయారు. అంతేకాదు.. ఈ జర్నలిజంతో విసిగి వేసారిపోయానని అందుకే తానే సొంతంగా ఒక చానెల్ ప్రారంభిస్తానని.. అందులో న్యూట్రల్‌గానే వార్తలు ఉంటాయని స్పష్టం చేశారు. వాస్తవానికి ఎప్పుడో చానెల్ పెట్టాలని అనుకున్నప్పటికీ కొందరు వద్దన్నారని ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పేశారు. చూశారుగా.. ఒక్క ప్రెస్‌మీట్‌తో ఎవరికేం కావాలి.. ఎవరికేం ఇవ్వాలో గట్టిగానే ఇచ్చిపడేశారు సాయిరెడ్డి.. ఇకపై ఆయన నిర్ణయాలు ఊహకందని రీతిలో ఉంటాయని స్పష్టంగా అర్థమవుతున్నట్లు వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.