హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. సైబరాబాద్ పరిధి, రాజేంద్రనగర్ డివిజన్‌లో తాజాగా ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కొటిక్ బ్యూరో, ఎస్ఓటి, రాజేంద్రనగర్ పోలీసుల ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఐదుగురు నైజీరియన్లతో పాటు, వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఇంతకు ముందు రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కొని, విచారణ వరకు వెళ్లివచ్చింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఈ డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ని ఓ కుదుపుకుదిపేసింది. రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్లు ఎందరో ఈ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఈ కేసు పక్కదోవ పట్టడంతో.. అంతా సైలెంట్ అయిపోయింది.
బాలీవుడ్ సంగతి అలా ఉంటే.. టాలీవుడ్‌లోనూ డ్రగ్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలెందరో డ్రగ్స్ విషయమై విచారణను ఎదుర్కొన్నారు. ఆ కేసు కూడా కామ్‌గానే అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ రకుల్ ప్రీత్ సింగ్ పట్టుపడటంతో.. మరోసారి టాలీవుడ్‌లో ఈ డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇప్పుడు అరెస్ట్ అయిన వారి నుంచి 200 గ్రాములకు పైగా కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.