ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మనసులో ఉన్న ఆ ఒకే ఒక్కడు ఎవరు..? ఆ లక్కీ ఛాన్స్ ఎవరిది..? సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తారా..? లేకుంటే ఇక్కడ యువ రక్తానికేనా..? ఇప్పుడిదే టీడీపీ, జనసేన.. బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో నడుస్తున్న పెద్ద చర్చ. ఈ క్రమంలో ఒకవైపు చంద్రబాబును కాకా పట్టే పనిలో కొందరు ఉంటే.. చినబాబు లోకేష్ ద్వారా రాయబారం నడిపిస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు. లెక్కలేనంత మంది ఆశావహులు ఉన్నా చివరికి ఆ ఒక్కటి ఎవరికి..? ఆ ఒక్కడు..? ఎవరు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎవరో.. ఆ ఒక్కడు..!?
ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత సీఎంగా చంద్రబాబు.. 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఐతే ఒక మంత్రి పదవి మాత్రం ఖాళీగానే ఉంది. మొత్తం 25 ఐతే.. 24 మంది మంత్రులు ఇప్పుడు ఉండగా మిగిలినది ఒకటి. ఆ ఒక్కటీ త్వరలోనే భర్తీ చేయాలని సీఎం సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. వాస్తవానికి ఈ పాటికే ఆ ఒక్కటీ లెక్క తేలిపోయేదే కానీ కాంపిటీషన్ గట్టిగా ఉండటం.. సామాజిక కోణంలో.. సీనియారిటీని బట్టి చూసినా లెక్కలేనంత మంది కనిపిస్తున్నారు. దీనికి తోడు.. చాలా మంది సీనియర్లను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టారు సీబీఎన్.
అదృష్టం ఎవరిదో..?
ఈ ఒక్క మంత్రి పదవి విషయంలో చంద్రబాబుకు పెద్ద తలనొప్పి వచ్చి పడిందని చెప్పుకోవచ్చు. టీడీపీలో చాలా మంది సీనియర్లు.. ఇది వరకు మంత్రులుగా పని చేసిన వారు చాలా మందే ఉన్నారు. ఇక ఆశావహుల విషయానికి వస్తే.. రాయలసీమ నుంచి పదుల సంఖ్యలో.. కోస్తా నుంచి ఐతే లెక్కలేనంత మందే ఉన్నారు. ఇక గుంటూరు, విజయవాడ నుంచి ఐతే చెప్పనక్కర్లేదు. మరోవైపు.. వైసీపీ నుంచి వచ్చిన వారికోసం టిక్కెట్లు త్యాగం చేసిన తెలుగు తమ్ముళ్లు కూడా ఉన్నారు. ఇక ఎలాగో పిఠాపురం సీటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ కూడా ఉన్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది. ఇక ఎలాగో జనసేన, బీజేపీ కూడా ఆ ఒక్కటీ మాకే కావాలని పట్టుబట్టి కూర్చున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? సొంత పార్టీకే పదవి ఉంటుందా..? పోటీ ఎక్కువగా ఉందని బీజేపీకే ఇచ్చేస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి.