మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ ఇటీవల లేవనెత్తిన విషయం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీనే కాదు.. టాక్ ఆఫ్ ద కంట్రీగా మారింది. చిన్న పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్, తండ్రికూతుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలను చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాంటి చీడపురుగులను వెంటనే శిక్షించాలని ఇటీవల తేజ్ ఓ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కాస్త వైరల్ అయింది. ఈ ట్వీట్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పోలీసు యంత్రాంగాన్ని కూడా ఆయన అలెర్ట్ చేశారు.
సాయిదుర్గా తేజ్ చేసిన ఈ ట్వీట్‌కు, ఆయన స్పందనకు.. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు రియాక్ట్ అవడమే కాకుండా.. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులే కాదు.. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చర్యలు చేపట్టింది. అలాంటి అసభ్యకర కంటెంట్‌తో వీడియోలు చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లపై యాక్షన్ తీసుకున్నట్లుగా.. అధికారికంగా మా ప్రకటించింది. అయితే సాయితేజ్.. కేవలం ట్వీట్‌తో సరిపెట్టకుండా.. ఈ విషయంలో తగ్గేదేలే అనే విధంగా మూవ్ అవుతున్నాడు.
తాజాగా ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. ఇలాంటి విషయాల్లో మరింత కఠినంగా చర్యలు ఉండాలని కోరారు. ఛైల్డ్ అబ్యూజ్‌ని అసలు క్షమించరాదని, కఠినంగా శిక్షలు ఉండేలా చూడాలని రేవంత్ రెడ్డిని ఆయన కోరినట్లుగా తాజాగా సాయి తేజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విషయంపై తనకు సమయం కేటాయించి, ఎంతో ఓపికగా తను చెప్పిన విషయాలు విన్న రేవంత్ రెడ్డి అండ్ టీమ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే తను లేవనెత్తిన అంశంపై వెంటనే స్పందించిన యంత్రాంగానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందని.. మరోసారి సాయి దుర్గా తేజ్ ఈ ట్వీట్‌లో తెలిపారు.