ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లికి అతిరథ మహారధులెందరో హాజరై సందడి చేశారు. దేశదేశాల నుంచి వచ్చిన అతిథులతో ఈ వేడుక అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో ఎంతో అట్టహాసంగా జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ నలుమూలల నుంచి ఈ వేడుకకు అతిథులు హాజరవడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి కనిపించడం అందరినీ ఆకర్షించింది.
అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో ఈ పెళ్లి వేడుకకు, ఆ తర్వాత జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై నార్త్‌లో తన రేంజ్ ఇదని చాటారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు వీరిద్దరూ కనిపించి.. బాబాయ్ వెనుక అబ్బాయ్ అనేలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంతోషపడేలా చేశారు. ఇంక ఈ వేడుకలో హైలెట్ అయిన విషయం ఏమిటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ SSMB29 సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్నారు. బాగా జుత్తు పెంచి, గడ్డం, మీసాలతో.. చూడగానే వావ్ అనేలా మహేష్ కనిపించడంతో.. ఒక్కసారిగా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మహేష్ బాబు ఫొటోలతో సోషల్ మీడియా అంతా షేకవుతుంటే.. మహేష్ బాబు మాత్రం మహేంద్ర సింగ్ ధోని ఫొటోని షేర్ చేసి మురిసిపోతున్నారు. అవును.. అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో ఎమ్మెస్ ధోనితో తీసుకున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేష్ బాబు.. లెజెండ్ ఎమ్.ఎస్. ధోనితో అంటూ లవ్ సింబల్స్ పోస్ట్ చేశారు. మహేష్ బాబు క్రికెట్ ప్రేమికుడనే విషయం తెలిసిందే. భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన ప్రతిసారి ఆయన ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇప్పుడు తను అభిమానించే క్రికెటర్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసి.. తన ఆనందాన్ని మహేష్ తెలియజేశారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.