40 ప్లస్ ఇయర్స్ రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చగల సమర్ధత, రాజకీయ చైతన్యం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతం. ఎందరో ప్రధానమంత్రులు, మరెందరో ముఖ్య నేతలు, పారిశ్రామిక వేత్తలతో ఆయన రాజకీయ అనుభవం మహత్తరమైనది. జీవితంలో, జీవన గమనంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విజయాలు, మరెన్నో పోరాటాలు ఇంతకంటే ఒక మనిషి ఒయోపిక్‌కు ఏం కావాలి? ప్రేక్షకులను అలరించడానికి కావాల్సిన కంటెంట్ ఆయన జీవిత చరిత్రలో చాలా ఉంది. అదంతా ఇప్పుడు తెరపైకి రాబోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్‌కి సంబంధించి క్లాప్ పడింది. ఈ బయోపిక్‌కు ‘ధర్మ చక్ర’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శనివారం ఈ బయోపిక్‌కు క్లాప్ కొట్టి ప్రారంభించారు. రాజధాని గ్రామం మల్కాపురం వి స్క్వేర్ ఆడిటోరియంలో ఈ ప్రారంబోత్సవం కార్యక్రమం జరుపుకుంది. పసుపులేటి వెంకట రమణ దర్శకత్వంలో మనోహర్ నాయుడు ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయానంతరం నాల్గవసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి రికార్డును క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు తన మార్క్‌ను ప్రదర్శించేందుకు అహర్నిశలు ఎంతగానో శ్రమిస్తున్నారు. ‘ధర్మ చక్ర’ విషయానికి వస్తే.. పది రోజుల పాటు అమరావతిలోనే ఈ బయోపిక్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కూడా నటిస్తుండటం విశేషం.