ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విజయం సాధించిన టీడీపీ కూటమి పాలనలో దిగ్విజయంగా నెల రోజులు పూర్తి చేసుకుంది.! ఈ నెల రోజుల్లో లోటు పాట్లు ఏంటి..? ప్రభుత్వం సాధించినది ఏంటి..? అనేది రాష్ట్ర ప్రజలకు బాగానే తెలిసి ఉంటుంది. ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నిన్న మొన్నటి వరకూ అసలు వైసీపీ నుంచి వలసలే ప్రోత్సహించే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు భావించారు కానీ పరిస్థితుల రీత్యా.. అవసరం కాబట్టి మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. బాబు అలా గేట్లు తెరిచారో లేదో ఇద్దరు రెడీ అయిపోయారు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకటి రెండు రోజుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పి.. పసుపు కండువా కప్పుకోవడానికి వారిద్దరు సిద్ధం అంటున్నారు.
ఏపీలో కూడా షురూ..!
ఆపరేషన్ ఆకర్ష్.. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న, నేతల చేరికలతో కనిపిస్తున్న పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నిత్యం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చెరిపోతున్నారు. ఆఖరికి ఆ నలుగురు (కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు) మాత్రమే మిగిలినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏమో..! ఇప్పుడు ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే టీడీపీలోకి రావడానికి వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు సైతం సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
ఇంతకీ ఎవరా ఇద్దరు..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప నుంచే టీడీపీలో చేరికలు మొదలు కానున్నాయి. అన్నమయ్య జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, శాసన మండలి వైస్ చైర్‌పర్సన్ జకియా ఖానమ్ టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. పదవి అనేది పేరుకే అని.. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ తాను ఏమీ చేయలేకపోయానని తీవ్ర ఆవేదనతో ఉన్నారట. సామాజిక వర్గంతోపాటు, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేక పోయానని మదన పడుతున్నారని అనుచరులు చెబుతున్న మాట. అందుకే ఇప్పుడు టీడీపీలో చేరడానికి.. మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ద్వారా రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఈమే.. మంత్రితో భేటీ కావడంతో ఈ చేరుకకు మరింత బలం చేకూరింది. మరో ఎమ్మెల్సీ పోతుల సునీత.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఈమె తిరిగి సొంత గూటికి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
ఎమ్మెల్సీలే ఎందుకు..?
శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ప్రస్తుతం వైసీపీకి 30 మంది, టీడీపీకి 09, జనసేనకు 01, పీడీఎఫ్ 02, ఇండిపెండెంట్లు 04, నామినేటెడ్ సభ్యులు 08 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. నలుగురు వైసీపీని వీడడంతో అనర్హత వేటు వేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీకి ఎమ్మెల్సీలు చాలా తక్కువ.. ఏదైనా బిల్లు లేదా చట్టం రూపొందించాలంటే శాసనమండలి ఆమోదం తప్పనిసరి. అందుకే వైసీపీకి ఎమ్మెల్సీలు ఎక్కువ ఉండటంతో కచ్చితంగా ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. అందుకే ఎంతమంది వస్తే అంతమందిని లాగేసుకోవాలని టీడీపీ వ్యూహ రచన చేసిందని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. జకీయా, సునితతో పాటు సుమారు 5 నుంచి 10 మంది ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.
బిల్లు ఆమోదం ఎలా..?
ప్రభుత్వం ఏదైనా బిల్లు, చట్టం అనేది తీసుకొని రావాలంటే మొదట అసెంబ్లీ ఆమోదం కావాలి. ఆ తర్వాత మండలికి వెళ్తుంది. ఒకవేళ ఈ తీర్మానం తర్వాత బిల్లును చర్చకు స్వీకరించి, దానిని శాసన మండలి వ్యతిరేకిస్తే.. ఆ బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళుతుంది. నిబంధనల ప్రకారం.. రెండోసారి అదే బిల్లును శాసనసభ ఆమోదిస్తే, మళ్లీ బిల్లు మండలికి వెళుతుంది. రెండోసారి కూడా మండలి బిల్లును తిరస్కస్తే, నిబంధనల ప్రకారం బిల్లు ఆమోదం పొందనట్లుగానే పరిగణిస్తారు. దీనికి గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత చట్టంగా మారుతుంది. అందుకే.. ఇంత తతంగం లేకుండా.. రేపొద్దున మండలిలో ఇబ్బందులు ఎదుర్కొకుండా ముందుగానే చంద్రబాబు ఇలా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. టీడీపీ గేట్లు ఎత్తింది కదా.. ఎమ్మెల్సీలతో మొదలై ఎక్కడ ఆగుతుందో.. ఎక్కడికి చేరుతుందో చూడాలి మరి.