తప్పు చేశానా.. అసలు ఇలా జరగకుండా ఉండాల్సింది ఏమో..! అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేదు..! ఇప్పటికే ఆలస్యం ఐపోయింది కదా..! పోనీ ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుందా..? పోనీ ఒకసారి అడిగి చూద్దామా..? వర్కవుట్ అవుతుందా..? కాదా..? ఇవే ఇప్పుడు పదే పదే జనసేన అధినేత, నేటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసులో మెదులుతున్న మాటలు..! అవునా ఇంతకీ ఏం జరిగిందబ్బా.. అంతా ప్రశాంతంగా ఉంది కదా.. ఐనా ఎందుకు ఇలా.. ఏమైంది అనే కదా మీ సందేహాలు.. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం వచ్చేయండి మరి..!
అసలేం జరిగింది..?
ఏపీ ఎన్నికల్లో కూటమి కట్టడం మొదలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకు కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే..! ఇందుకుగాను సేనానికి తగిన ప్రాధాన్యత ఇచ్చిన కూటమి.. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించడం జరిగింది. వాస్తవానికి మీకు ఏ శాఖలు కావాలన్నా తీసుకోవచ్చు అని ఓపెన్ ఆఫర్ వచ్చినా సేనాని సద్వినియోగం చేసుకోలేదట. ఐతే పవన్ తీసుకున్న వాటిలో కొన్ని కీలక శాఖలే. ఐతే అప్పటి వరకూ హోం శాఖ కావాలని పవన్ అడిగినట్లు.. అభిమానులు, కార్యకర్తల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది కూడా..! ఐతే తనకు అంత ఇంట్రెస్ట్ లేదని లైట్ తీసుకున్న పవన్.. పర్యావరణ, అటవి శాఖలు దక్కాయి. ఐతే వ్యవసాయ కావాలని కోరినప్పటికీ ఎందుకో ఇది ఆయనకు దక్కలేదు. ఐతే.. ఇప్పుడు పవన్ కాస్త హోం శాఖ విషయంలో ఆలోచనలో పడ్డారట.
ఎందుకు.. ఏమైంది..!?
ఫలితాలు వచ్చింది మొదలుకుని నేటి వరకూ ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. రోజులో ఎక్కడో ఒకచోట ఘర్షణలు, విధ్వంసాలు, పార్టీల నేతలు, కార్యకర్తలు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులే వెళ్లి కేసులు పెట్టినా పోలీసులు తీసుకొని పరిస్థితి. ఆఖరికి ఇటీవల ఒక వ్యక్తి తీవ్ర రక్త గాయాలతో మేజిస్ట్రేట్ ముందుకు వచ్చిన పరిస్థితి కూడా చూశాం. ఇక ఆడ పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు ముఖ్యంగా నందికొట్కూరు, వైజాగ్ ప్రాంతాల్లో జరిగిన ఘటనలు డిప్యూటీ సీఎంను తీవ్రంగా కలచివేశాయట. దీంతో హోం శాఖ తన దగ్గర ఉంటే బాగుండు ఏమో.. అని తన అనుయాయుల దగ్గర బాధపడ్డారట. ఏపీలో అసలు హోం మంత్రి ఉన్నారా..? లేరా..? అని ఒక్కోసారి సందేహం వస్తోందని కూడా చెప్పారట. అంటే.. తాను ఇప్పుడున్న హోం మంత్రి అనితను సందేహించినట్లు కాదు కానీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా..? అనే సందేహాలు వ్యక్తం చేశారట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. దీనికితోడు ఒకటికి పదుల సంఖ్యలో జనసేన నేతలు, మంత్రులు.. బీజేపీ పెద్దలు కొందరు కూడా డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు చేయడం మరో ఎత్తు అట. ఇప్పటికే ఆలస్యం అయ్యింది.. పోనీ ఇప్పుడు హోం శాఖ అడిగితే ఎలా ఉంటుందనే దానిపై కూడా ఆలోచన ఉందట. ఇందులో నిజా నిజాలు ఏంటో తెలియాల్సి ఉంది.
అప్పట్లో ఇలా..!
నాకు అధికారం ఇచ్చి చూడండి నేనేంటో చూపిస్తా..! మీరు నన్ను గెలిపించి చూపిస్తే రాష్ట్రాభివృద్ధి అనేది ఎలా ఉంటుందో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా..! అలాగే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తా..! ఒక ఆడబిడ్డ మీద ఇలా చూడాలంటే లోపలే భయం వేయాలి అలా చేస్తా..! ఇవీ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడిన మాటలు. ఈ వ్యాఖ్యలను పాయింట్ ఔట్ చేస్తూ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలను పదే పదే వైసీపీ నేతలు, కార్యకర్తల గుర్తు చేస్తున్న పరిస్థితి. ఏమైంది.. మరిచిపోయారా..? ఈ మాటలు అన్నది తమరే కదా అంటూ కొందరు జనసేన అభిమానులు, కార్యకర్తలు సైతం డిప్యూటీ సీఎంకు గుర్తు చేస్తున్న పరిస్థితి.