అధికారం లో ఉంటే ఏం చేసినా చెల్లుతుందా, అక్కడ ఏ వెధవ పనిచేసినా ప్రతిపక్షం పట్టించుకోదా, ఒకవేళ పట్టించుకున్నా పవర్ ముందు ఏం చెయ్యలేరా, అదే ప్రతిపక్షం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారుల దగ్గర నుంచి ఎమ్యెల్యేలు, మాజీ మంత్రుల వరకు కేసులు పెట్టి జైలు కి పంపించడం అనేది పరిపాటిగా మారింది.
గత ప్రభుత్వమైన వైసీపీ వాళ్ళు రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలుకుతూ.. టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి ఎక్కువ ప్రజాధరణ ఉందొ, ఎవరు అవినీతికి పాల్పడ్డారో అన్ని లెక్కలేసి మరీ ఇరికించి టీడీపీ నేతలను భయ బ్రాంతులకు గురిచేసి జైలులో పెట్టారు. అచ్చెన్నాయుడు, కోడెల, నారాయణ, అయ్యన్న, చివరికి మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబు ని రాజమండ్రి జైలులో ఉంచారు. వాళ్ళ ఎంపీ రఘురామరాజునే పోలీస్ స్టేషన్స్చుట్టూ తిప్పారు.
ఇప్పడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వాళ్ళందరిని జైలుకి పంపేందుకు రెడీ అయ్యింది. జోగి రమేష్ దగ్గర నుంచి ధర్మారెడ్డి వరకు చాలామందిని అవినీతికి పాల్పడినవాళ్లలో ఉన్నట్టుగా చెబుతున్నారు. కొడాలి నాని ని బియ్యం కేసులో, రోజా ని టీడీపీ శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో, పెద్దిరెడ్డిని, సజ్జల ఇలా వైసీపీ నేతలందరిని జైలుకు పంపే ఏర్పాట్లలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా కనబడుతుంది వ్యవహారం.
మరి ప్రతిపక్షంలో ఉన్నపుడు వాళ్ళు చేసేవన్నీ వీరికి కనిపించలేదా.. కనిపించినా కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోరని ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇవన్నీ చేస్తున్నారా అనేది అర్ధం కానీ ప్రశ్న. ఇది రివెంజ్ రాజకీయాలేనా, వైసీపీ మొదలెట్టింది కూటమి ప్రభుత్వం ఆచరిస్తుంది అనేలా చాలా కనిపిస్తున్నాయి.