Advertisement
TDP Ads

చంద్రబాబు నెల పాలనలో లోటు పాట్లేంటి?

Fri 12th Jul 2024 12:21 PM
chandrababu  చంద్రబాబు నెల పాలనలో లోటు పాట్లేంటి?
How is Chandrababu month-long rule? చంద్రబాబు నెల పాలనలో లోటు పాట్లేంటి?
Advertisement

చంద్రబాబు నెల రోజుల పాలన ఎలా ఉంది..?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గట్టి అఖండ విజయం సాధించిన టీడీపీ.. అధికారం చేపట్టి నేటికి నెల రోజులు పూర్తయ్యింది..! దీంతో చంద్రబాబు 4.0 పాలన ఎలా ఉంది..? నెల రోజుల్లో సర్కార్ సాధించిందేంటి..? ప్రభుత్వం లోటు పాట్లు ఏంటి..? ప్రభుత్వంపై ప్రజలు ఏమంటున్నారు.. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి..? సొంత క్యాడర్ సంతృప్తిగానే ఉందా..? సూపర్ సిక్స్‌లో భాగంగా ఒకట్రెండు అమలు చేసిన తీరు ఎలా ఉంది..? ఉచిత ఇసుక, పెన్షన్లు, తల్లికి వందనంపై జరుగుతున్న చర్చేంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!

పాలన ఎలా ఉంది..?

చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అణకువగానే నెలరోజులు నడిచిందని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. తొలిరోజే ఐదు సంతకాలు చేసిన బాబు.. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయ్ గనుక మున్ముందు అభివృద్ధి అంటే ఏంటనేది చూడొచ్చు. మెగా డీఎస్సీ, టైటిలింగ్‌ చట్టం రద్దు, అన్న క్యాంటీన్లతో మొదలైన ప్రభుత్వం దిగ్విజయంగానే సాగుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి ఒక రూపు తెచ్చేందుకు ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. ఎలాగో కేంద్రంలోని ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కాబట్టి రాష్ట్రానికి శుభ సూచికలే ఉన్నాయి. ఇక సంక్షేమం అంటారా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. కాస్త ఇబ్బంది అయినా వలంటీర్లు అవసరం లేకున్నా సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంచిపెట్టారు. అంతేకాదు.. దేశ చరిత్రలో స్వయంగా లబ్దిదారుల దగ్గరికే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం అంటే ఇదొక మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు.

ఇవే లోటు పాట్లు!

ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు అనేవి కామన్. అయితే ఒక్క నెలరోజుల్లోనే పాలన ఎలా ఉందని చెప్పడం కూడా కష్టమే..! అంతకుమించి లోటు పాట్లు కూడా ఎత్తి చూపడం కూడా ఒకింత తప్పే కావొచ్చేమో..! కానీ శాంతి భద్రతల విషయంలో చాలా వరకు లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఫలితాలు వచ్చిన మరుసటి  క్షణం మొదలైన దాడులు, విధ్వంసాలు.. వైసీపీ కార్యకర్తలు, నేతలపై మొదలైన దాడులు నేటికి ఆగలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్న వార్తలు వస్తూనే ఉన్నాయ్.. సోషల్ మీడియాలో ఒక లుక్కేస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే బాధితులు వెళ్లి స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసినప్పటికీ స్వీకరించకపోవడం గమనార్హం. దీంతో ఏకంగా కోర్టు మెజిస్ట్రేట్ దగ్గరికి తీవ్ర రక్తగాయాలతో వెళ్లిన ఘటనలో చూసే ఉంటాం. ఇక పెన్షన్ల విషయంలో ఇంటికే వచ్చి ఇస్తామన్నారు కానీ.. నేతల ఇళ్లలో అది కూడా సచివాలయ సిబ్బందిని పిలిపించుకుని ఇవ్వడంలో కొంత జనాల్లో అసంతృప్తి అయితే కనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొన్ని ఉన్నాయి.

ఎందుకిలా..?

ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం వేరు.. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రియాల్టీ అన్నది వేరు. ఎందుకంటే ఆర్థిక స్థితి గతులు, అమలు చేసే పరిస్థితి ఉందా లేదా అన్నది అప్పుడే అర్థమవుతుంది. ఉచిత ఇసుక, తల్లికి వందనం ఈ రెండూ కూటమి మేనిఫెస్టోలో ఉన్నవే. అయితే.. ఉచిత ఇసుక విషయంలో ఎందుకో చంద్రబాబు సర్కార్ యూటర్న్ తీసుకుంది. ఇసుక మాత్రమే ఉచితం అని రవాణా చార్జీలు, 12 వందల నుంచి 15 వందల వరకూ డబ్బులు (ఒక్కో ఏరియాలో ఒక్కోలా) కట్టించుకోవడం, అది కూడా శాశ్వత పాలసీ కాకుండా టెంపరరీ  కావడం గమనార్హం. దీనికి తోడు తల్లికి వందనం అదే నాటి అమ్మ ఒడి విషయంలో లేనిపోని మార్గదర్శకాలు ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. ఒక్కరికే వర్తిస్తుందని వార్తలు రావడం, దీన్ని ఎవరూ ఖండించకపోవడం పైగా లేనిపోని కండిషన్లతో తీవ్ర విమర్శలే వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు.. నీకు.. నీకు.. నీకు.. నీకు.. ఇలా పిల్లలను చూపించి మరీ డబ్బులు ఇస్తామని చెప్పిన సందర్భాలను గుర్తు చేస్తున్న పరిస్థితి. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కొందరే.. మిగిలిన వారి సంగతేంటో..?

శాఖల వారీగా చూస్తే.. నారా లోకేష్, పవన్ కల్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత తప్పితే మరెవ్వరూ చురుగ్గా కనిపించట్లేదన్నది ప్రధాన ఆరోపణ. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం అయితేనేం.. శాఖల్లో పనితనం చూపించిన తీరు.. ఇవన్నీ బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా శాఖల్లో మార్క్ చూపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక కొందరు మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని ఇప్పటికే చేయాల్సిన పనులు చేస్తున్నారని ఈ క్రమంలో చంద్రబాబు నుంచి వార్నింగ్‌లు కూడా వెళ్లాయనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఆ మధ్య భర్త మంత్రి కావడంతో ఆయన సతీమణి చేసిన పోలీసులతో చేసిన ఓవరాక్షన్ అందరూ చూసే ఉంటాం. ఇలాంటి ఒకట్రెండు ఘటనలతో ప్రభుత్వానికి మాయని మచ్చ అవకాశం చాలా ఉంది.

అధికారులు.. క్యాడర్‌లో..!

ఇక.. నాటి వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అధికారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల విషయంలో అస్తమాను ట్రాన్స్‌ఫర్లతో కాస్త ఎందుకో ఎక్కవ అనిపించింది. గత  ప్రభుత్వంలో పనిచేసినంత మాత్రాన వారిని ఇబ్బంది  పెట్టి, బలవంతంగా పదవీ విరమణ, రాజీనామా చేయించడంతో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీంతో మిగిలిన అధికారులు ఎప్పుడేం జరుగుతుందో అని ఆందోళన చెందే వాతావరణం కనిపిస్తోంది. ఇక ఎలాగే క్యాడర్‌ అంటారా.. పదవులు రాలేదనో, లేకుంటే పట్టించుకోలేదనో అసంతృప్తి, అసహనం మామూలే.. అధికారం వచ్చి నెలరోజులే కదా అయ్యింది.. మరోవైపు నామినేటెడ్ పదవులు కూడా రెడీ అవుతున్నాయి. పార్టీకోసం కష్టపడిన వారికి కచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. మొత్తమ్మీద మూడు పూవులు, ఆరు కాయలు అని కాదులే కానీ.. బెటర్..!

How is Chandrababu month-long rule?:

Chandrababu has completed a month long rule as Andhra CM fourth time

Tags:   CHANDRABABU
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement