కూటమి అధికారంలోకి రాగానే ఏపీలో మళ్ళీ ఉచితంగా ఇసుక ఇస్తాం.. జగన్ పాలనలో అంతులేని అక్రమాలు సామాన్యులకు అందుబాటులో లేని ధరలు.. సంక్షోభంలో పడ్డ నిర్మాణ రంగానికి చంద్రబాబు బాసట.. ఇవీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు పదే పదే చెప్పిన మాట. అనుకున్నట్టే కూటమి అధికారంలోకి వచ్చింది.. జులై 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేస్తాం అని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కూడా..! ఇప్పుడు చెప్పండి.. ఇసుక ఫ్రీ అనుకుంటే ఎవరు మాత్రం ఏమనుకుంటారు చెప్పండి.. ఉచితమే అనుకుంటారు అంతే కదా..! కానీ.. ఇక్కడ లోడింగ్, రవాణా ఛార్జీలు పెట్టుకుంటేనే ఇసుక ఫ్రీ అని ప్రభుత్వం చెప్పడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలు నోరెళ్ళబెట్టిన పరిస్థితి.
నాడు.. నేడు..!
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో టన్ను ఇసుక ధర రూ.375 ఉండేది. ఇప్పుడు అది కాస్త కూటమి ప్రభుత్వంలో టన్ను ఇసుక ధర ట్రిపుల్ అంటే రూ.1,225 అయ్యింది. కొన్ని ఏరియాల్లో ఐతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెట్లు పెట్టేశారు. ఇంకొన్ని చోట్ల ఐతే ఫ్రీ ఇసుకకు ముందే తవ్వేశారు.. తరలించేశారు కూడా! దీంతో సోషల్ మీడియా వేదికగా ఒక రేంజిలో ప్రభుత్వంపై విమర్శలు.. ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తిట్టిపోసేసారు. సరిగ్గా ఈ సమయంలోనే స్వయంగా.. సీఎం చంద్రబాబు ఫ్రీ ఇసుకపై మాట్లాడారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం.. ఇచ్చాం.. ఇప్పుడు దాన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారు.. ఎలా మాట్లాడుతున్నారు అంటే ఉచిత ఇసుక అంటే అదేదో మేము ఇంటికి తీసుకెళ్ళి ఇస్తామని, ఇల్లు కట్టిస్తామని అన్నట్టుగా చెబుతున్నారు.. ఇదేం రాజకీయం అంటూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో చంద్రబాబు తొలి యూటర్న్ తీసుకున్నారని వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది.
ఎందుకిలా..?
ఉచితం అన్నాక.. ఉచితంగానే ఇవ్వాలి కదా చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నారో అని సామాన్యుడు మొదలుకుని నేతల వరకూ ఆలోచనలో పడిన పరిస్థితి. టన్ను ఇసుక దాదాపు 1400 అంటే.. 20 టన్నుల లారీ 28,000 అవుతుంది.. దీనికితోడు రవాణా అదనం.. అలాంటప్పుడు ఉచిత ఇసుక ఎట్లయింది ఈ పాలసీలో..? అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. పైగా ఈ ఆదాయం కూడా ప్రభుత్వానికి రాదు కేవలం కాంట్రాక్టర్లకి.. అదికూడా డిజిటల్ రూపంలో మాత్రమే.. ఇదేదో తేడాగా ఉందే అంటున్నారు మేధావులు..గెలిచి నెల కూడా కాలేదు.. అప్పుడే చంద్రబాబుకి ఎంత అహంకారం పెరిగిందో చూడండి అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తిట్టేస్తున్నారు. ఇక మరికొందరు ఐతే.. మీకు ఉచిత ఇసుక టన్ను రూ.1394 అయింది.. ట్రాన్సుపోర్టు చార్జీలు ఎగస్ట్రా.. అంటూ కుమారి ఆంటీ డైలాగ్స్ పేల్చుతున్నారు. ఇలా ఒకటా రెండా సూపర్ సిక్స్ కూడా ఇలానే చేస్తే పరిస్థితి ఏంటి..? రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.