కేటీఆర్ పాదయాత్ర.. సీఎం అవుతారా?
పాదయాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ట్రెండ్..! నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ట్రెండ్ సెట్ చేయగా నాటి నుంచి నేటి వరకూ ఇది నడుస్తూనే ఉంది..! పాదయాత్ర చేస్తే జైత్రయాత్రే..! అధికారం ఖాయం అంతే..! వైఎస్, చంద్రబాబు.. వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక నారా లోకేష్ ఐతే యువగళం పాదయాత్ర చేసి.. 2024 ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారకుడు అయ్యారు.. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. ఇవన్నీ మనం కళ్ల ముందు చూసినవే..!
నేనూ యాత్ర చేస్తా..!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంతు వచ్చినట్టే అనిపిస్తోంది..! విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు యువనేత పాదయాత్రకు ఫిక్స్ అయ్యారని తెలియవచ్చింది. ఇదే విషయంపై కొందరు గులాబి పార్టీ నేతలు మాట్లాడుతూ.. యాత్ర జరగొచ్చు అన్నట్లుగానే చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేటీఆర్ పాదయాత్ర చేస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక టీమ్ షెడ్యూల్ అంతా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ నియోజకవర్గం కవర్ అయ్యేలా.. సీఎం రేవంత్ సొంత ఇలాకా కొడంగల్ నుంచి ప్రారంభమై భాగ్యనగరంలో ముగుస్తుందని తెలుస్తోంది.
యాత్ర ఎందుకు..?
అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యి.. పార్లమెంట్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన గులాబి పార్టీ ఒక్కొకరుగా కారు దిగి వెళ్ళిపోతూ ఉండటం.. రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు డబుల్ డిజిట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతూ ఉండటంతో పార్టీ ఉంటుందో.. ఊడుతుందో అన్నట్లుగా పరిస్థితి ఉంది.! సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సైతం అంతంత మాత్రమే అమలు అవుతున్నాయ్ అన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. మరీ ముఖ్యంగా.. నిరుద్యోగులు, రైతులు, కరెంట్ కష్టాలు.. ఇలా ఒకటా రెండా ఏదీ సరిగ్గా ఇవ్వట్లేదని.. విద్య, శాంతి భద్రతలు, రైతన్నల ఆత్మహత్యలు ఇలా ఎన్నో విషయాల్లో రేవంత్ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలం అయ్యిందని గులాబీ నేతల పదే పదే చెబుతున్నారు. ఇక జనాల్లోకి వెళ్లి ఈ విషయాలన్నీ నిజం చేస్తూ యాత్ర చేయాలని కేటీఆర్ ఫిక్స్ అయ్యారట.
కేసీఆర్ ప్లాన్..!
వాస్తవానికి కేటీఆర్ తాను ఏంటో నిరూపించకోవడానికి ఇది సరైన సమయం. పార్టీ బలహీనపడటం, నేతలు పార్టీ మారుతుండటం, క్యాడర్ చేజారిపోతుండటం.. ప్రభుత్వంపై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతుండటం.. ఇలా వరుస పరిణామాలు జరగుతున్న తరుణంలో ప్రజల్లోకి వెళ్లి పాజిటివ్ సంకేతాలు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. అందుకే ఇక కుమారుడిని రంగంలోకి దించాల్సిన సమయం ఆసన్నమైందని మాస్టర్ ప్లాన్ వేసిన గులాబి దళపతి కేసీఆర్ వ్యూహ రచన చేశారని తెలుస్తోంది. 2028 ఎన్నికల్లో గెలిస్తే అవసరం ఐతే కేటీఆర్ ను సీఎం చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదీ కేసీఆర్ ప్లాన్.. కేటీఆర్ అమలు చేయబోయేదే ఈ పాదయాత్ర కథ..! ఏం జరుగుతుందో చూడాలి మరి.