అవును.. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీల వరకూ ఇప్పుడిదే సందేహం..! అధికారం ఉన్నప్పుడు ఆకాశమంత ఎగిరెగిరి పడిన నాటి వైసీపీ మంత్రులు, నేతలు ఏమయ్యారు.. ఎక్కడున్నారు..? ఇంతకీ రాజకీయాల్లో వారంతా ఉన్నట్టా..? లేనట్టా..? కొంపదీసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసే యోచనలో ఉన్నారా..? అనే ప్రశ్నలు కార్యకర్తలు, అభిమానులు, అనుచరుల్లో వస్తున్నాయి. నాడు రోజుకు రెండు, మూడుసార్లు మీడియా మీట్‌లు పెట్టి నానా రచ్చ చేసి ఇప్పుడెందుకు ఇంత సైలెంట్ అయ్యారు..? ఇదంతా వ్యూహాత్మకమా..? లేకుంటే మరేదైనా ఉందా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
సార్లు.. మేడమ్స్ ఏరీ!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు మంత్రులు మీడియా, సోషల్ మీడియాలో వైఎస్ జగన్ కంటే ఎక్కువగా మాట్లాడేవారు.. హడావుడి చేసేవారు. ఎంతో యాక్టివ్‌గా ఉంటూ రోజులో ఒక్కరైనా మంత్రులు మీడియాతో మాట్లాడేవారు. అది కూడా నోటికొచ్చినట్లు మాట్లాడటం, పచ్చి బూతులు సైతం తిట్టిన సందర్భాలు ఉన్నాయ్. ప్రతిపక్షాలు అంటే అబ్బే అసలు లెక్క చేసేవాళ్లే కాదు..! ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపైనే అయితే ఒక్కటే తిట్లు. ఇలాంటి వారిలో నాటి మంత్రులు రోజా, విడదల రజినీ, కొడాలి నాని, అనిల్ కుమార్, గుడివాడ అమర్నాథ్‌లు ముందు వరుసలో ఉండేవారు. మీడియా ముందుకు వస్తే చాలు.. మూడు బూతులు.. ఆరు కౌంటర్లు అన్నట్లుగా మాట్లాడేసేవారు. అలాంటిది ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. మంత్రులు మొత్తమ్మీద ఒక్కరంటే ఒక్కరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే గెలిచి నిలిచారు.
ఇదేం రాజకీయం!
వైసీపీ ఓడిపోయిన తర్వాత వీళ్లంతా ఎక్కడికెళ్లారు..? ఏమైపోయారు..? అధికారం ఉంటేనే ప్రజల్లో తిరగడం.. వారి శ్రేయస్సు కొరతారా..? లేకుంటే అస్సలు వద్దా ఏంటని సొంత కార్యకర్తలు, నేతలు దెప్పి పొడుస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ఘోర ఓటమికి మంత్రుల బూతులు కూడా ఒక కారణమన్నది జగమెరిగిన సత్యమే. ఓడిన, గెలిచిన అభ్యర్థులతో జగన్ క్యాంప్ ఆఫీస్ వేదికగా మీటింగ్ జరుపుతున్నప్పటికీ కొందరు మాజీ మంత్రులు కనిపించకపోవడం.. ఇదివరకూ ఆయా మంత్రుల శాఖలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు, కుంభకోణాలు సైతం బయటికి వస్తున్నప్పటికీ నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో.. ఆ మాజీలు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారనే అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. ఒకవేళ మీడియా ముందుకు వచ్చిన ఒళ్లు దగ్గరపెట్టుకుని ఒకటికి, పదిసార్లు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. లేనిచో పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకుని మెలిగితే మంచిదని వైసీపీ కార్యకర్తలు, నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి.