వైసీపీ.. ఉవ్వెత్తున ఎగిసింది.. అంతే రీతిలో పడిపోయింది..! పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ ఎన్ని కష్ట, నాష్టాలు అంతకుమించి ఆటు పోటులు ఎదుర్కొందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు!. నాడు వైఎస్ జగన్, విజయమ్మతో మొదలై.. 2014లో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలుచుకుని సరిగ్గా ఐదేళ్లలోనే 2019లో 151 మందిని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను.. అంటూ ప్రమాణం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు అమలు మొదలుకుని చెప్పని హామీలు కూడా చేసి చూపించారు. అలాంటిది సడన్‌గా ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందో అంతు చిక్కట్లేదు కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం అయ్యింది. దీంతో ప్రస్తుతం వైసీపీలో అంతర్మథనం నడుస్తోంది.
మార్పు మంచిదేగా..!
2019 ఎన్నికలతో పోలిస్తే.. 2024 ఎన్నికలకు అసెంబ్లీలకు ఇంచార్జులు మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల వరకూ భారీగానే మార్పులు, చేర్పులు చేసేశారు జగన్. సరిగ్గా ఇదే ఈ ఘోర పరాజయం పాలవ్వడానికి ఉన్న కారణాల్లో ఒక్కటన్నది వైసీపీ కార్యకర్తలు చెబుతున్న మాట. మార్పులు చేయక బీఆర్ఎస్ ఓడిందని నమ్మిన జగన్.. మార్చి గెలుద్దామని ఊహించని మార్పులే చేశారు.. అయినా సరే ఘోరాతి ఘోరంగా ఓడిపోయి క్రికెట్ టీమ్‌కు పరిమితమైంది. దీంతో ఇప్పుడు వైసీపీని జీరో నుంచి ఆయన మొదలుపెట్టాల్సిందే. అంటే పార్టీని గాడిలో పెడుతూ, మరోవైపు ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉందన్న మాట. దీంతో వైసీపీని ప్రక్షాళన చేయాల్సిందేనని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. అవును.. ఇంచార్జ్‌లను మార్చి, యువరక్తం ఎక్కిస్తే పార్టీ ఎక్కడో ఉంటుంది.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
గ్రౌండ్ నుంచే రావాలి..!
గ్రామ, మండల స్థాయి మొదలుకుని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల వరకూ మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ నాయకులు వైసీపీకేం కరువేం కాదు.! ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామ, పట్టణ స్థాయిలో ఉన్న లీడర్లు చాలా మంది అమ్ముడుపోయి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు కోకొల్లలు. అసలు ఇది ఎంతవరకూ నిజం అని తేల్చి.. వారి స్థానంలో కొత్త వ్యక్తులను నియమించాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే పోస్టుమార్టం మొదలుపెట్టిన జగన్.. ఈ విషయాలపై దృష్టి పెట్టి, ద్వితియ శ్రేణి నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలు, ఫిర్యాదులు తీసుకోవాలి. ఇలా దశల వారీగా పార్టీని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రక్షాళన చేయాల్సిందేననే డిమాండ్ కార్యకర్తల నుంచి సర్వత్రా వస్తోంది. అంతేకాకుండా పార్టీ కోసం పనిచేసిన, పోరాడిన.. దెబ్బలు తిన్న, తింటున్న.. వారికి పదవులు ఇస్తే మంచిది. ఎందుకంటే.. వారిలో ఆ కసి, ఉత్సాహం, పోరాట పటిమ వేరేగా ఉంటుంది. ఏదైతేనేం.. ప్రక్షాళన సమయం ఆసన్నమైంది.. ఇక ఆలస్యమెందుకు కానిచ్చేస్తే పోలా జగన్.. ఎనీ వే ఆల్ ది బెస్ట్..!