అదిగో వైఎస్ జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు.. ఇదిగో కడప పార్లమెంట్‌కు పోటీ చేయబోతున్నారు..! వారం రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొదలుకుని సోషల్ మీడియా వరకూ ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ..! ఇక జగన్ అంటే పడని దినపత్రికలు, చానెల్స్ అయితే ఇంకేముంది జగన్ పని అయిపోయింది.. ఇక కోలుకోలేడు.. అంటూ ఓ రేంజిలో ఊదరగొట్టేశాయ్! ఇవన్నీ ఒక ఎత్తయితే.. వైఎస్సార్ జయంతి కానుకగా రాజీనామా చేస్తున్నారంటూ కూడా తెగ హడావుడి చేసేశాయి కొన్ని చానెల్స్. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించడం అయ్యింది.. జయంతి కార్యక్రమాలూ ముగిశాయి. రాజీనామా మాత్రం అస్సలు కాలేదు..! పోనీ రాజీనామా చేశారే అనుకుందాం.. తర్వాత ఏం జరుగుతుంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
నాడు.. నేడు..!
వైఎస్ జగన్.. పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నారనే వార్తలతో వైసీపీలో ఒకింత కలవరం మొదలైంది. ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాడర్‌ను కాపాడుకొని 2029 ఎన్నికలకు సమాయత్తం కాకుండా ఇవన్నీ అవసరమా..? అని కొందరు అంటుంటే.. అవును జాతీయ స్థాయిలోనే ఇప్పుడు జగన్ తన దమ్మేంటో చూపించాలని, దేశమంతా ఆయన రేంజ్‌లో ఏంటనేది తెలియాలని మరికొందరు కోరుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో తొలిసారి కడప పార్లమెంట్ నుంచి పోటీచేసిన జగన్.. 178,846 ఓట్లు, 2011 ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో 5,43,053 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకూ పులివెందుల ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. నాటి నుంచి నేటికీ కడప పార్లమెంట్, పులివెందుల నియోజకవర్గాలు వైసీపీ కుటుంబానివే. వైఎస్ విజయమ్మ కూడా 2010, 2011 ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు సేమ్ సీన్.. అంటే ఎంపీగా జగన్, ఎమ్మెల్యేగా విజయమ్మే పోటీ చేయబోతున్నారన్నది టాక్.
ఏమైనా జరగొచ్చు!
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఘోరాతి ఘోరంగా క్రికెట్ టీమ్ 11కే పరిమితం అయ్యింది. అయితే.. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా జగన్ ఇటు.. విజయమ్మ అటు పోటీ చేస్తే ఓడిపోనూ వచ్చు.. గెలిచినా గెలవచ్చు. ఎందుకంటే.. అసలే పరిస్థితులు సరిగ్గా లేవు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంతవరకూ నిందితుడు కాదని పదే పదే చెప్పిన జగన్.. రాజీనామా చేయిస్తే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుంది..? అనేది కూడా తెలుసుకోవాలి. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో ఎలాంటి అనుభవం ఎదురైందో కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవీఎంలు మేనేజ్ చేశారనే ఆరోపణలు వైసీపీ నుంచి ఏ రేంజిలో వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదే నిజమైతే.. ఇప్పుడు జగన్, విజయమ్మను ఓడించడానికి ఎందుకు అదే సీన్ ఇక్కడ రిపీట్ కాదో కూడా తెలుసుకోవాలి. పోనీ.. ఈవీఎం మేనేజింగ్ లేదే అనుకుందాం.. అధికార పార్టీని కాదని.. అది కూడా తక్కువ మెజార్టీతో గట్టెక్కిన వైసీపీని ఎందుకు ప్రజలు గట్టెక్కించాలో కూడా సెలవు ఇవ్వాల్సి ఉంది. అయినా ఢిల్లీ వెళ్లి పొడిచేది ఏముంది..? ఇక్కడుండి ప్రభుత్వాన్ని ఎండగట్టి, తెలివిగా ప్రవర్తించి ఈ ఐదేళ్లు క్యాడర్‌ను కాపాడుకుంటూ, ఓటమికి గల కారణాలు తెలుసుకుని పోస్టుమార్టం చేసుకుంటే మంచిది సుమీ.