మంచి మనసుకు డాక్టర్ వైఎస్సార్!
కొందరు కొన్నాళ్లు ఉండి.. పోతారు..! కొందరు పోయినా శాశ్వతంగా ఉంటారు..! ఇలాంటి వారిలో వైఎస్సార్ ముందు వరుసలో ఉంటారు..! వైఎస్.. ఇది పేరు కాదు ప్రభంజనం.. జనం గుండెల్లో నిలిచేపోయిన, చరిత్ర మరిచిపోలేని పేరు..! ప్రజల గుండెల్లో కొలువైన ప్రజా రక్షకుడు! ప్రగతి కోసమే జీవించిన నాయకుడు..! వ్యవసాయాన్ని పండగ చేసిన చరిత్రకారుడు! సంక్షేమాన్ని పేదవాడికి అందించిన గొప్ప నాయకుడు..! విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత.. ఈ ఐదు లక్షణాలూ కలిగిన సుపరిపాలకుడు! నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి.
రూపాయి డాక్టర్.. పులివెందుల పులి!
1949, జులై 8.. వైఎస్ఆర్ పుట్టిన రోజు. కడప జిల్లా పులివెందులలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు పుట్టిన సంతానమే వైఎస్. ప్రజా జీవితంలో ఉన్న రాజారెడ్డి వారసుడిగా వైద్యుడి రూపంలో నిరుపేదలకు సేవ చేస్తూ సామాజిక సేవను అలవర్చుకున్నారు. మెడిసిన్ పూర్తి చేసి వైద్య వృత్తిని స్వీకరించిన వైఎస్.. రూపాయికే వైద్య సేవలందించి.. ‘రూపాయి డాక్టర్’గా పేరుపొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న వైఎస్సార్ ఓటమెరగని నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. అలా 1989లో మొదలైన రాజకీయ ప్రస్థానం.. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి వరకూ అంచెలంచెలుగా ఎదిగారు. ఓటమి ఎరుగని నాయకుడిగా కడప రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్సార్‌ను అభిమానులు ‘పులివెందుల పులి’గా ముద్దుగా పిలుచుకుంటారు. రాజకీయాల్లోకి ప్రవేశించాకా అదే సేవా భావంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. అలా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ ప్రజల మనిషిగా మారారు. అలా.. పులివెందుల నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం పావురాల గుట్టలో ముగిసింది.!
చెరగని ముద్ర!
ఒకటా రెండా వైఎస్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయ్. ఆరోగ్య శ్రీ నుంచి 108 వరకు.. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నుంచి రుణమాఫీ వరకు ఇలా చెప్పుకుంటే పోతే చాలా పథకాలే ఉన్నాయి. ఆ మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి.. ప్రశంసలు అందుకున్నాయి.. అందుకుంటూనే ఉన్నాయి. తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి.. ప్రజల్లో గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన వ్యక్తి. అందుకే ఆయన పాలన సంక్షేమానికి చిరునామా.. ఆయన సంతకం అభివృద్ధికి వీలునామా.. ఆయన స్వచ్ఛతకు రాజముద్ర.. ఆయన మాటే విశ్వసనీయతకు బాట..! సుధీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది కొట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకుని.. ప్రజలకు గుండె చప్పుడు అయ్యారు.
వర్దిల్లు కలకాలం!
ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతిహామీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి. ఒక నిర్ణయం తీసుకున్నాక ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే వెనక్కి తగ్గని రాజకీయ ధీరుడు వైఎస్. అందుకే ఆయన్ను మాట తప్పని.. మడమ తిప్పని యోధుడు..! అని అంటుంటారు. నీ రూపం ప్రజల గుండెల్లో పదిలం.. నువ్వు యాడికీ పోలేదు రాజన్నా.. కాలం ఉన్నంతవరకూ నిన్ను మరవలేం పెద్దాయన అని వీరాభిమానులు, నేతలు చెప్పుకుంటూ ఉంటారు. నాటికి.. నేటికీ.. ఎప్పటికీ మరుపురాని మహానేత వైఎస్సార్..! తెలుగు తనానికి ప్రతిబింబం.. ఆ పంచెకట్టు ఆయనకు ఆయనే సాటి.. మంచి మనసుకు డాక్టర్.. రాజసానికే రాజసం.. మానవత్వానికే మానవత్వం కలగలిపిన గొప్ప వ్యక్తి. మరణం లేని జననం మీది.. వర్దిల్లు కలకాలం రాజశేఖరా!