Advertisement

వైఎస్ షర్మిల దెబ్బ.. వైసీపీ అబ్బా!!

Sun 07th Jul 2024 10:51 AM
jagan  వైఎస్ షర్మిల దెబ్బ.. వైసీపీ అబ్బా!!
Sharmila aggressiveness వైఎస్ షర్మిల దెబ్బ.. వైసీపీ అబ్బా!!
Advertisement

షర్మిల దూకుడు.. తలపట్టుకుంటున్న జగన్

వైఎస్ ఫ్యామిలీ చెల్లాచెదురు అవుతోంది..! ఒకప్పుడు ఈ కుటుంబం ఎలా బతికిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఫ్యామిలీ అంటే పలానా అని చెబుతారు కదా.. ఆ పలానాలో ఈ కుటుంబం ఉండేది..! కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఇలా ఉండకూడదు బాబోయ్ అని నలుగురు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న పరిస్థితి. ఓ వైపు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరోవైపు వైఎస్ షర్మిల.. ఇంకోవైపు వైఎస్ విజయమ్మ ఇలా తయారయ్యింది కుటుంబం.! వీరికి వైఎస్ అవినాష్ రెడ్డి, సునీత రెడ్డి కూడా తోడయ్యారు..! ఒక్కమాటలో చెప్పాలంటే 2019 ఎన్నికల ముందు.. ఆ తర్వాత అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి.

అసలేం జరుగుతోంది..?

అన్న వదిలిన బాణం.. 2024 ఎన్నికల్లో ఎలా గుచ్చుకుందనేది వైఎస్ జగన్ బాగా రుచి చూశారు..! ఈ దెబ్బ మానక ముందే పుండు మీద కారం చల్లడానికి రెడీ అవుతున్నారు చెల్లి..! శత్రువులు, విరోధులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే ఉంటారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.! జులై-08న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు షర్మిల. ఇందుకు విజయవాడ వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు.. ముఖ్యంగా తెలంగాణ, కర్నాటక సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధా రామయ్యలు.. డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, డీకే శివ కుమార్ విచ్చేయనున్నారు. వీరికి ఇప్పటికే ఆహ్వానాలు కూడా వచ్చాయి కూడా.

ఒకే వేదికపై సాధ్యమేనా..?

ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉన్న తన తల్లి విజయమ్మను కూడా షర్మిల పిలిపిస్తున్నారు..! అంటే ఒక్క జగన్ రెడ్డి తప్ప.. నాటి బద్ధ శత్రువులుగా మారిన వారితోనే వేదిక పంచుకుంటున్న పరిస్థితి..! వాస్తవానికి జగన్ ఓదార్పు యాత్ర సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ హై కమాండ్ అనుమతి అడగగా కాదనడం.. ఆ తర్వాత ఏం జరిగింది.. నాడు, నేడు పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరూ ఒకే వేదికపై కలుస్తున్నారు. వాస్తవానికి.. గాంధీ ఫ్యామిలీ నుంచి ఒక్క రాహుల్ మాత్రమే రావాలని అనుకున్నప్పటికి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, రాష్ట్ర ప్రజలకు తామే అధికార టీడీపీకి ప్రతిపక్షం అని.. వైసీపీకి ప్రత్యామ్నాయం అని చాటి చెప్పుకోవడానికి అందరూ వస్తున్నారని తెలిసింది. ఇది ఎంత వరకు జరుగుతుందో తెలియట్లేదు కానీ.. షర్మిల మాత్రం పెద్ద ఎత్తునే హడావుడి చేస్తున్నారు.

జగన్ ఏం చేయబోతున్నారు..?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. వైఎస్ జయంతి వేడుకలకు వైఎస్ జగన్ హాజరవుతారా..? చెల్లి షర్మిల నుంచి పిలుపు ఉంటుందా..? ఒకవేళ పిలిస్తే వెళ్తారా..? లేదంటే పార్టీ ఆఫీసులో వేడుకలను మమా అనిపించేస్తారా..? అనేది తెలియట్లేదు. వెళ్తే సోనియా, రాహుల్ గాంధీలతో కలిసి వేదిక పంచుకోవాల్సి వస్తుంది.. వెళ్ళకపోతే ఇప్పటి వరకూ తల్లి, చెల్లినే పట్టించుకోలేదనే అపవాదు మూట కట్టుకున్న జగన్.. ఇక నాన్నను కూడా పక్కన పెట్టేశారనే ఆరోపణలు వస్తాయి. అంటే ఫ్యామిలీ ఒకవైపు, ఒంటరిగా జగన్ ఇంకోవైపు అన్న మాట. అసలే ఇప్పుడు విజయమ్మ.. షర్మిల వైపు ఉన్నారు. దీంతో జగన్ ఆహ్వానించాక రాకుంటే ఎవరు ఎన్నెన్ని మాటలు, తిట్లు తిడతారో చెప్పనక్కర్లేదు. 

సమయం వచ్చేసింది..!

2024 ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమి పాలైన వైసీపీని మరింత దెబ్బతీసి.. కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా అడుగులు ఈ వేదిక నుంచే అడుగులు పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీనే దిక్కని వైసీపీ శ్రేణులకు పరోక్ష సంకేతాలు పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలే ఎన్నికల్లో చెల్లి పొడిచిన పోటును మర్చిపోలేకపోతున్న జగన్.. ఈ పరిణామంతో తలపట్టుకునే రోజు వచ్చేస్తుందని చర్చ జరుగుతోంది. 

అంతే సంగతులు..!

వైఎస్ జయంతి వేడుకలకు సోనియా, రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రులు వస్తే.. మరీ ముఖ్యంగా వైఎస్ విజయమ్మ హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇది గ్రాండ్ సక్సెస్ అయితే మాత్రం వైసీపీ మనుగడకే ప్రమాదమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్న.. టెన్షన్ పడుతున్న పరిస్థితి. ఇక ఇదే వేదికపై నుంచి వైఎస్ జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తే వైఎస్ ఆశయాలను సర్వ నాశనం చేశారని.. రాజన్న రాజ్యం తనతోనే, తాను ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని బలంగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వరుస కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నాలు, ఎక్కడ ఏం జరిగినా.. హామీలు, సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నిలదీసే కార్యక్రమాలు, ఇలా వైసీపీ స్థానాన్ని కాంగ్రెస్ అక్రమించడానికి ఏం చేయడానికైనా షర్మిల గట్టిగా, అంతకు మించి మాస్టర్ ప్లాన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక్కడ సీన్.. అక్కడ రిపీట్!

ఇదే జరిగితే వైసీపీ అడ్రస్ గల్లంతే..! అప్పుడిక నాడు కాంగ్రెస్ పార్టీనీ వదిలి వైసీపీలోకి కార్యకర్తలు, నేతలు.. ముఖ్యనేతలు ఎలా వెళ్లారో.. ఇప్పుడు వారంతా తిరిగి సొంత గూటికి వచ్చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. తెలంగాణలో 2018 ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఎలా ఉండేవి..? ఆ తర్వాత ఎవరి స్థానాలు ఎవరు ఆక్రమించారో తెలుసు కదా..! ఆఖరికి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఊహించని రీతిలో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడం, ఇక బీజేపీ ఎలా బలపడిందో మనం చూశాం కదా..! ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు..!

Sharmila aggressiveness:

Jagan vs Sharmila

Tags:   JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement