బాబు, రేవంత్ భేటీ.. ఉప్పొంగిన ఆనందం!!
ఒకప్పుడు.. ఇప్పుడూ ఈ ఇద్దరూ గురు శిష్యులే..! ఈ బంధం.. ఈ నాటిది కాదు.. ఏనాటిదో..! ఇద్దరూ ఇద్దరే..! గురువును మించిన శిష్యుడు..! శిష్యుడిని మించిన గురువు..! గురువు ఇంకా ఎదగాలని శిష్యుడు.. గురువు అంత కాకపోయినా సగం అయినా కావాలని ఎన్నో కలలు కన్నాడు..! అనుకున్నది సాధించాడు.. ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరూ ఒకే హోదాలో.. అది కూడా చెరోక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు..! చూశారా.. ఆ కిక్కు, ఆనందం, మజా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి..! ఈ సీన్ చూడటానికి అభిమానులు, కార్యకర్తలకు రెండు కళ్ళు కూడా చాలవ్ అంతే..!
నాడు.. నేడు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు..! ఇక కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు..! మాస్ లీడర్ కావడం, ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం రాష్ట్ర టీడీపీ అధినేతగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడం పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రి ఇలా అంచెలంచలుగా ఎదిగిపోయారు రేవంత్. ఎన్నో కష్టాలు, ఇంకెన్నో ఆటు పోటులు ఆఖరికి జైలు జీవితం కూడా గడిపారు. ఇప్పుడు అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో గురు శిష్యులు అధికారం చేపట్టారు.. తొలిసారి ముఖ్యమంత్రుల హోదాలో హైదరాబాద్ వేదికగా కలుసుకున్నారు..! ఇక చూడండి.. ఆ అభిమానులు, అనుచరులు, కార్యకర్తల ఆనందం మాటల్లో చెప్పలేం అంతే..!
విమర్శలు కూడా..!
ఇప్పటి వరకూ గురు శిష్యుల బంధం గురుంచి చూశాం కదా.. ఈ ఇద్దరి జీవితంలో మరిచిపోలేని, మాయని మచ్చగా ఉండే ఘటన కూడా ఒకటి ఉంది. అది మరేదో కాదు ఓటుకు నోటు..! ఈ ఒకే ఒక్కటీ నాటికి నేటికి జనాల్లో అలా ఉండిపోయింది అంతే. అందుకే తాజా భేటీతో కొందరు విమర్శకులు పాత విషయాలు అన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కలి వైపరిత్యం అంటే ఇదే...
నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసి అడ్డంగా దొరికిన ఓటుకు నోటు దొంగలు తెలంగాణలో అధికారికంగా భేటీ అయ్యారు. కలియుగంలో దొంగలు కూడా రాజ్యం ఏలుతారని బ్రహ్మంగారు ఎప్పుడో తన కాలజ్ఞానంలో రాసుకుంటే ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామని తిట్టిపోస్తున్న పరిస్థితి. ఇంతకు మించి ఇద్దరి భేటీపై గర్వంగా కూడా అభిమానులు చెప్పుకుంటున్నారు కూడా..!