వైఎస్ జగన్‌లో ఎంత మార్పు..?
అవును.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారిపోయారు! ఎంతలా అంటే.. నాడు ఏదైతే వద్దు అని అసహ్యించుకున్నారో.. నేడు అదే ముద్దు అయ్యింది..! నాడు వద్దన్న అదే నోటితో నేడు రండి.. రండి అని పిలుచుకుంటున్న పరిస్థితి..! సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పాలంటే దెబ్బకు దిగొచ్చారు..! అధికారం లేకపోతే ఇలాగే ఉంటుంది సుమీ అని జనాలు, రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏమిటబ్బా..? అనే సందేహం వచ్చింది కదా.. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ఫుల్ క్లారిటీతో తెలుసుకుందాం..!
ఇదీ అసలు సంగతి..!
మీడియా.. ఫోర్త్ ఎస్టేట్ పవర్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడైతే సోషల్ మీడియా కూడా ముఖ్యమే. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు పట్టుమని ఒకట్రెండు కూడా మీడియా సమావేశాలు పెట్టిన సందర్భాల్లేనే లేవు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఢిల్లీ వేదికగా ఏపీ భవన్ నుంచి ఒక్కటంటే ఒకే సమావేశం నిర్వహించినట్లు గుర్తు అంతే..! ఆ తర్వాత ఇక వీడియోల రూపంలో తన సందేశాన్ని రిలీజ్ చేయడం.. ఇక బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాలు, నేతలతో సమావేశాల్లో మాత్రమే మాట్లాడారు. అస్సలు మీడియాను దారుణాతి దారుణంగా చూసిన జగన్.. ఇష్టానుసారం వ్యవహరించి, నచ్చని చానెల్స్‌ను తొక్కిపట్టేశారు. ఇక ఆ పార్టీకి చెందిన నేతలు సైతం మీడియా సమావేశాలకు కొన్ని దినపత్రికలు, చానెల్స్‌ను అనుమతించేవారు కాదు. అదేనబ్బా యథారాజా అన్నట్లుగా నేతలు కూడా ఫాలో అయిపోయారు.
సీన్ మారిపోయిందే..!
ఐదంటే ఐదేళ్లు సీన్ మొత్తం మారిపోయింది. జగన్ మళ్లీ జీరోకు వచ్చేశారు..! నాడు వద్దన్న, చీదరించుకున్న మీడియానే నేడు రండబ్బా.. అని అడుగుతున్న పరిస్థితి. ఫలితాల తర్వాత ఇప్పుడిప్పుడే జగన్ జనాల్లోకి వస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని.. కడప రిమ్స్‌లో వైసీపీ కార్యకర్తను పరామర్శించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడటం, పులివెందుల పర్యటనలో సమావేశం నిర్వహించడం ఇలా ప్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్. ఎంతైనా అధికారం లేకుంటే ఇలానే ఉంటుందేమో. వాస్తవానికి మీడియాను దూరం పెట్టడం, మీడియాతో మాట్లాడకపోవడం కూడా వైసీపీ ఘోర పరాజయానికి ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అందుకే ఆ తప్పును ఇలా సరిదిద్దుకుంటున్నారన్న మాట. సో.. అధికారం ఉన్నప్పుడు కొండెక్కి కూర్చున్న జగన్.. ఇప్పుడు దెబ్బకు దిగొచ్చారన్న మాట. మున్ముందు మాజీ సీఎం చాలా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిందే..!