కేసీఆర్‌ను ఆరుతో కొడుతున్న రేవంత్!
అవును.. ఆరుతో కేసీఆర్‌ను కొడుతూ.. కారు గాలి తీసేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..! ఈ దెబ్బతో కారు ఎక్కడ బోల్తా పడుతుందో అని అందులోని వ్యక్తులంతా బయటపడుతున్నారు!. ఒకప్పుడు కారు.. సారు అనే మాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! అయితే.. ఇప్పుడు పూర్తిగా కనుమరుగై కారు సారు కంగారుగా తయారయ్యింది.! కారు పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారో.. ఏ నిమిషాన జంప్ అయిపోతారో తెలియని పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే గులాబీ బాస్ లక్కీ నంబర్ ఆరే కావడం గమనార్హం.
కారులో కంగారు!
ఆరు ఇది అందరికీ నంబర్ అయితే.. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కంగారుగా మారింది.! ఎంతలా అంటే.. ఈ సంఖ్య కనిపించినా, ఎవరినోటైనా పదం వినిపించినా బెంబేలెత్తిపోయేంత పరిస్థితి. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలో బీఆర్ఎస్‌కు బై బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. అది అందరూ బిగ్ షాట్‌లే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేయడానికి రంగం సిద్ధం చేసేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే చేరిక ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు చెప్పండి ఇన్నిసార్లు ఆరు ఆరు ఆరు అనేది రిపీట్ అయితే ఏ పార్టీ మాత్రం కంగారు ఉండదో!
ఎవరు ఏం జరుగుతోంది..?
ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు.. తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసుల రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్యలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. వీరంతా ఒక్కొక్కరుగా చేరగా.. గురువారం అర్ధరాత్రి ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు దండే విఠల్, భాను ప్రసాద్, ఎం.ఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేష్, బొగ్గవరపు దయానంద్, బసవరాజ్ సారయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. తెల్లారితే అమావాస్య కావడం, సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆలస్యంగా రావడంతో అర్ధరాత్రికి చేరికలు జరిగాయి. ఇప్పుడిక తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మా రెడ్డి, అరికెపూడి గాంధీ ఈ ఆరుగురు కారు దిగడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ ఆరుగురిలో నలుగురు రేవంత్‌కు మంచి మిత్రులు కాగా.. మరో ఇద్దరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లి గెలిచిన వారు. చూశారుగా.. ఇదీ సారు.. ఆరు.. కంగారు కథ..!