టైటిల్ చూడగానే అవునా.. ఇదేంటబ్బా అనుకుంటున్నారా..? అవును.. ఇన్నాళ్లు సినిమాల్లో ఓ వెలుగు వెలిగారు గనుక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరే.. ? ఇక రియల్ స్టార్ ఎక్కడ్నుంచి వచ్చాడబ్బా..? అనే డౌట్ వచ్చేసింది కదూ..! పోనీ.. రాజకీయాల్లో రాణిస్తున్నారు కాబట్టి రియల్ స్టార్ అని అనుకుంటున్నారేమో అబ్బే అస్సలు కాదండోయ్..! ఇదీ కాకుంటే ఇంకేంటని అనుకుంటున్నారు కదూ.. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
ఇదీ అసలు కథ..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయ్యారు. డిప్యూటీ సీఎంతో పాటు ఆరు శాఖలకు మంత్రి అయిన పవన్.. పిఠాపురంనే తన ఆస్థానంగా మలుచుకోవడానికి ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇక్కడ్నుంచే పోటీ చేస్తానని.. ఇందుకు ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటానని చెప్పిన పవన్ ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలోని గొల్లుప్రోలు వైపు వెళ్లే 216వ జాతీయ రహదారిలో 3.52 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఈ ఒక్క ఘటనతో సీన్ మొత్తం మారిపోయింది. ఎంతలా అంటే.. పిఠాపురం పేరు ఒక్క జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా చర్చించుకుంటున్న పరిస్థితి.
ఎందుకింతలా..?
పవన్ భూములు కొనడంతో ఒక్కసారిగా చుట్టు పక్కల భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఎంతలా అంటే.. అప్పటి వరకూ భూములు కొనడానికి ఎవరైనా వస్తే బాగుండని అనుకున్న వారే.. బాబోయ్ అస్సలు అమ్మకూడదు పరిస్థితులు మారిపోయాయ్ కదా అని అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే.. ఇప్పుడు ఆ భూముల రేంజ్ పెరిగింది గనుక. భూమి కొనేవాడు ఇప్పటి వరకూ ల్యాండ్ ధర చెప్పేవాడు.. ఇప్పుడు అమ్మే వ్యక్తే ధరను నిర్ణయించే పరిస్థితి వచ్చిందన్న మాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా పవన్ భూముల చుట్టుపక్కలా కొనడానికి ఎగబడుతున్నారు. ఇక జనసైనికులు, అభిమానులు, కార్యకర్తలు అయితే కనీసం అర ఎకరం అయినా కొంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిఠాపురం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూముల వేటలో ఉన్నారు. చూశారుగా.. సేనాని భూములు కొన్నాక ఎంత మార్పు వచ్చిందో.. అందుకే పవన్ పవర్ స్టార్ మాత్రమే కాదు.. రియల్ స్టార్ అన్నది.!