అవును.. ఆధార్ అన్నింటికీ ఆధారం..! రేషన్ కార్డ్ మొదలుకుని బ్యాంక్ ఖాతా, ఆర్థిక కార్యకలాపాలు, గ్యాస్ సబ్సిడీలు, ఓటేసేందుకు, మొబైల్ సిమ్‌కు.. చివరకు జనన, మరణాలకు.. ఇలా అన్నింటికి ఆధార్ ఒక్కటే ఆధారం. దేన్ని ధ్రువీకరించాలన్నా ఇది తప్పనిసరి..! ఇక ఎక్కడికైనా వెళ్లి నేను ఫలానా అని చెప్పుకునేందుకు సైతం ఆధార్ కావాల్సిందే..! ఈ విషయంలో సామాన్యుడు మొదలుకుని ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒక్కటే. అయితే.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అబ్బే.. తాను దీనంతటికీ మినహాయింపు, మనమంతా వేరు అన్నట్లుగా ప్రవర్తించారు.
ఏం జరిగింది..?
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం విధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టాల్సిన పరిస్థితి. సెంట్రల్ జైలుకు వెళ్లిన జగన్.. ములాఖత్‌కు అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలో జైలు మాన్యువల్ ప్రకారం ములాఖత్ అయ్యే వ్యక్తి ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంది. అయితే.. మాజీ సీఎం మాత్రం అబ్బే.. నేను ఆధార్ కార్డు ఇవ్వడమేంటి..? అయినా నన్ను ఆధార్ అడుగుతారేంటి..? నేను ఇవ్వనంటే ఇవ్వనని మొండికేశారట. ఇచ్చి తీరాల్సిందేనని జైలు అధికారులు పట్టుబట్టడంతో అవునా.. సరే ఇక చేసేదేముంది కానివ్వండి అంటూ ఆధార్ ఇచ్చారట జగన్. అప్పటి వరకూ ఓకే కానీ.. పిన్నెల్లితో మాట్లాడటానికి స్పెషల్‌గా గది ఏర్పాటు చేయాలని షరతులు పెట్టారట. ఇక్కడ అలాంటివేమీ ఉండవ్ సార్.. సాధారణ ములాఖత్ మాత్రమేనని చెప్పడంతో ఇక చేసేదేలేమీ మిన్నకుండిపోయారట. అటు ఆధార్.. ఇటు ములాఖత్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో చూశారుగా..!
అంతగా ఏముందో..?
అయినా.. ఇంత అందరిలాగా కాకుండా వైఎస్ జగన్ ఆధార్ కార్డులో అంత ప్రత్యేకత ఏముందబ్బా..? అని జనాలు చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. ఇక్కడ ఇచ్చినంత మాత్రాన వేరే వేరే పనులకు జైలు అధికారులు వాడరు.. అంత అవసరమూ వాళ్లకు లేదు. పోనీ ఆధార్‌ను దుర్వినియోగం చేయడానికి అస్సలు లేదు.. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో చాలా గోప్యత కూడా పాటించాల్సి ఉంటుంది. సర్వం ఆధారే కదా సార్.. పోనీలే ఇస్తే ఏమవుతుంది. ఇక ములాఖత్‌కు ముందు ఇంత రచ్చ జరిగితే.. ఆ తర్వాత మీడియా ముందుకు పిన్నెల్లి మొదలుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు, వార్నింగ్‌లు, అమ్మ ఒడి, రైతు భరోసా ఇలా అన్ని విషయాలపై మాట్లాడి రచ్చ రచ్చే చేశారు జగన్. ఆఖరికి రెడ్ బుక్‌పై కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతే రీతిలో టీడీపీ, జనసేనల నుంచి కౌంటర్లు కూడా వచ్చి పడ్డాయ్..!