మార్వెల్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ యూనివర్స్, ప్రశాంత్ నీల్ యూనివర్స్.. ఈ మధ్య కాలంలో బాగా హైలెట్ అవుతోన్న ఈ యూనివర్స్‌లోకి సంచలన దర్శకుడు శంకర్ కూడా చేరాలని చూశారట. కానీ, చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నానని తాజాగా శంకర్ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అదేంటి.. అంత కెపాసిటి ఉన్న దర్శకుడు అలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అని అంతా ఆశ్చర్యపోవచ్చు. కానీ శంకర్ సమాధానం వింటే ఆయన నిర్ణయం సబబే అని అనిపిస్తుంది. ఇంతకీ శంకర్ ఏం చెప్పారంటే..
ఆ మధ్య అంతా సినిమాటిక్ యూనివర్స్ అని అంటూ ఉంటే.. నాకు కూడా శంకర్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి సినిమాలు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనని నా స్నేహితులకి, సహాయ దర్శకులకి, ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పినప్పుడు.. వారిలో ఎవ్వరూ పెద్దగా ఎగ్జయిట్ అవ్వలేదు. దీంతో నా నుంచి వారే కాదు, ప్రేక్షకులు కూడా అది ఎక్స్‌పెక్ట్ చేయడం లేదని అర్థమైంది. అందుకే ఆ ఆలోచన విరమించుకున్నాను.
సినిమాటిక్ యూనివర్స్ అలా ఉంచితే.. నేను ఫ్యూచర్‌లో జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను. ఇంకా చారిత్రక, సైన్స్ ఫిక్షన్ కథాంశాలతోనూ సినిమాలు చేసే ఆలోచన ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ని వాడి అందరినీ ఆశ్చర్యపరిచే మంచి చిత్రాలు చేసే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం మూడు సబ్జెక్ట్స్ రెడీగా ఉన్నాయి. భారతీయుడు 3 ఉంటుంది కానీ.. గేమ్ ఛేంజర్‌కి సీక్వెల్ ఉండదు.. అని శంకర్ చెప్పుకొచ్చారు.