మా ఆస్కారుడికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఆ ఆస్కారుడు ఎవరో అర్థమైందా? ఇంకెవరు చిరు విశ్వంభరకు స్వరాలు సమకూర్చుతున్న ఎమ్.ఎమ్. కీరవాణి. జన్మదిన శుభాకాంక్షలే కాదు.. ఓ మెమరబుల్ వీడియోని కూడా ఈ పోస్ట్‌లో షేర్ చేశారు. మెమరబుల్ అని ఎందుకు అన్నామనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇందులో మెగాస్టార్ ఇంట్లో విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగినట్లుగా మెగాస్టార్ చెప్పుకొచ్చారు.
అంతేకాదు, చిరంజీవికి నంది అవార్డు తెచ్చి పెట్టిన ఆపద్భాందవుడు చిత్రంలోని పాట చుక్కల్లారా చూపుల్లారా అనే పాటను మరోసారి ప్లే చేసి తనను ఎంతో సంతోషపెట్టారని, మళ్లీ ఆ రోజులకు తీసుకెళ్లారని ఎంతో సంబరపడుతూ ఈ వీడియోలో చిరు చెబుతున్నారు. ఈ రోజే జన్మించిన మా ఆస్కారుడు ఎం.ఎం. కీరవాణి గారికి నా హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు అని తెలిపిన మెగాస్టార్.. ఆపద్భాందవుడు సినిమా, అప్పటి కంపోజింగ్ గురించి ఎంతో చక్కగా వెల్లడించారు.
ఒకప్పుడు అందరూ ఒకచోట చేరి, సంగీత దర్శకుడు ఊహల్లోంచి ప్రవహిస్తున్న బాణీని.. బాగున్నాయో, లేదో చర్చించుకుని.. ఆమోద ముద్ర వేశాకే, ఆ పాట బయటికి వచ్చేది. మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ.. మళ్లీ మా కీరవాణిగారు విశ్వంభర కోసం పాటలను కంపోజ్ చేసే ప్రక్రియ మా ఇంట్లో ఏర్పాటు చేశాం. అది జరుగుతున్న సందర్భంలో మాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఆపద్భాందవుడు మ్యూజిక్ కంపోజ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆనాటి ఆ మధురగీతాన్ని ఆయన ఆలపిస్తుంటే, మనసు తియ్యని అనుభూతికి లోనయింది. దానిని మీతో ఇలా పంచుకోవాలని మీ ముందుంచుతున్నాను. ప్లీజ్ ఎంజాయ్.. అంటూ చిరు ఈ వీడియోతో తన సంతోషాన్ని తెలియజేశారు.