ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడిదే బర్నింగ్ టాపిక్. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ వారసులు ఎవరు..? వీరి తర్వాత కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చేదెవరు..? ఇంతకీ వారసులు ఉన్నారా.. లేదా..? ఒకవేళ ఉంటే ఎవరు వాళ్లు..? అనేది ఇప్పుడు ఇరు పార్టీల కార్యకర్తలు, వీరాభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. అయితే.. ఈ ప్రశ్నలకు జగన్, పవన్ అత్యంత సన్నిహితులు చిత్ర విచిత్రాలుగా చెబుతున్న పరిస్థితి.
అవునా.. నిజమేనా..?
వైఎస్ జగన్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చు. ఏ క్షణాన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. అదలా ఉంచినా ఇప్పుడిప్పుడే వైసీపీ సర్కార్‌పై శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్న టీడీపీ సర్కార్.. ఎప్పుడేం చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ నారా చంద్రబాబును అరెస్ట్ చేసి ఎంత రచ్చ చేసిందో నాటి జగన్ సర్కార్ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదికూడా 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టడంతో.. ఇవన్నీ అక్రమ కేసులేనని రివెంజ్ తీర్చుకోవడానికి జగన్ ఇలా చేశారని టాక్ నడిచింది. అందులో నిజానిజాలెంతో దేవుడెరుగు కానీ.. ఇప్పుడు జగన్‌ను మాత్రం అంత ఆషామాషీగా వదులుతుందా అంటే అస్సలు వదలదు గాక వదలదు. అందుకే.. రేపొద్దున్న జగన్ అరెస్ట్ అయితే పార్టీ బాధ్యతలు చేపట్టేదెవరు..? ఆయనలా పార్టీకి, కార్యకర్తలు, నేతలకు అండగా ఉండేదెవరు..? అనేది చర్చ మొదలైంది. అయితే.. జగన్ అరెస్ట్ చేస్తే ఆయన పెద్ద కూతురు హర్ష రెడ్డి బాధ్యతలు చేపడుతారని వైసీపీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. భారతీ ఉండగా ఆ అవసరం లేకపోవచ్చని కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. అంటే.. జగన్ వారుసురాలు హర్ష రెడ్డి అన్న మాట.
పవన్ సంగతేంటి..?
వాస్తవానికి జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచీ అన్నీ తానై చూసుకున్నారు పవన్. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారు. పవన్ అనుకున్నది సాధించారు.. ఎంతలా వైసీపీని అధ:పాతాళానికి తొక్కుతానని అన్నంత పనిచేశారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి.. డిప్యూటీ సీఎం, ఐదారు శాఖలకు మంత్రిగా ఉంటున్నారు. పవన్ తర్వాత ఎవరు..? సేనాని వారసుడు ఎవరన్నది ఇప్పటి వరకూ చర్చ రాలేదు కానీ.. ఇప్పుడు మాత్రం జనసైనికుల్లో ఇదే చర్చ. ఆయన తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకునేది ఎవరు అనే చర్చ నడుస్తున్న తరుణంలో.. వారసుడు ఇంకెవరో కాదు అకీరా నందన్ అని కార్యకర్తలు, వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఎవరూ అంత ఇంట్రెస్టు చూపించట్లేదు. అందుకే.. అకీరాను ఎప్పుడైనా వారసుడిగా ప్రకటించొచ్చని టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే.. సీఎం చంద్రబాబుతో సమావేశాలు జరిగిప్పుడు అకీరాను వెంటబెట్టుకోవడం, ఢిల్లీ వెళ్లినప్పుడు తనతో పాటు తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి పరిచయం చేయడం ఇవన్నీ ఇందులో భాగమేనని తెలుస్తోంది. ఏమో.. ఏమైనా జరగొచ్చు మరి.