ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి హోరంగా ఓడిపోయిన వైసీపీ.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకుండా క్రికెట్ టీమ్‌లాగా 11 అసెంబ్లీ స్థానాలు, 04 పార్లమెంట్ స్థానాలకే పరిమితం అయ్యింది. ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వర్కవుట్ అయ్యే అవకాశాలు మాత్రం అస్సలు కనిపించట్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. గత ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలన చేసిందని.. ఇష్టానుసారం టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలను ఇబ్బంది పెట్టిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో అలా ఫలితాలు వస్తుండగానే రంగంలోకి దిగిన తెలుగు తమ్ముళ్లు, కార్యకర్తలు ఎక్కడపడితే అక్కడ.. స్థానికంగా ఎవరైతే తమను ఇబ్బంది పెట్టారో వైసీపీ కార్యకర్తలు, నేతలను దొరికినోళ్లను దొరికినట్లే ఉరికించి మరీ చితక్కొట్టేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పటికీ ఉన్నాయి. నాడు మొదలైన ఈ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకూ కార్యకర్తలు మాత్రం రివెంజ్ తీర్చుకోగా ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఇక్కడ్నుంచే మొదలు..!
టీడీపీ కార్యకర్తలు, నేతలు చేసిన దాడిలో వైసీపీ వాళ్లు గాయపడటం, ఆస్తులు ధ్వంసం ఇలా పలు రకాలుగా నష్టపోయిన వారు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నారు. అందుకే కార్యకర్తలు, నేతలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడుతారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. వైసీపీ నేతలు సైతం ఇదే విషయాన్ని మీడియా వేదికగా చెప్పారు కూడా. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్ను పరామర్శించి, ఓదార్చి ఇక్కడ్నుంచే తాను అనుకున్న ఓదార్పు యాత్ర మొదలుపెట్టబోతున్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. పిన్నెల్లితో మొదలై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర జరుగుతుందని జగన్ అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. గురువారం నాడు నెల్లూరుకు జగన్ రానున్నారు. జైలులో ములాఖత్ అయ్యి.. పిన్నెల్లికి ధైర్యం చెప్పనున్నారు జగన్.
రూట్ మ్యాప్ రెడీ అవుతోందా..?
వైఎస్ పాదయాత్ర చేపట్టినా, సిద్ధం, మేమంతా సిద్ధం ఇలాంటి సభలకు షెడ్యూల్ మొదలుకుని రూట్ మ్యాప్ వరకూ అన్నీ తానై చూసుకున్నది ఎమ్మెల్సీ తలశిల రఘురాం. ఇప్పుడు ఓదార్పు యాత్రకు సంబంధించి కూడా ఆయనే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. ఇప్పుడు ఓదార్పు యాత్ర చేపట్టి.. కార్యకర్తలు, నేతలకు అండగా లేకపోతే అసలుకే ఎసరు వస్తుందని సర్వం సిద్ధం చేస్తున్నట్లు జగన్ అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో 18, కోస్తాంధ్రలో 15, విజయవాడ.. గుంటూరులో 07 .. రాయలసీమలో నెలరోజులకు పైగానే ఓదార్పు యాత్ర ఉండే అవకాశం ఉందట. ఈ యాత్ర అవ్వగానే ఇక కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి దశలవారిగా సూపర్ సిక్స్ విషయంలో ధర్నాలు, నిరసనలు అవసరమైతే దీక్షలు సైతం చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారట. ముఖ్యంగా.. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో దీక్ష ఉండే అవకాశం ఉందట. ఇంకా ఏమేం జరుగుతుందో చూడాలి మరి.