ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమిని ఇరుకున పెట్టడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు..! ప్రత్యేక హోదా అనే అంశాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇచ్చి తీరాల్సిందేనని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే మిత్రుడి (మిత్రపక్షంగా జేడీయూ)గా ఉన్న ఆయన మెలిక పెట్టారు. దీంతో ప్రధాని మోదీ పెద్ద తలనొప్పి వచ్చి పడినట్లయ్యింది. అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ కేంద్రానికి పంపింది. పార్లమెంట్ వేదికగా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది.. గట్టిగానే డిమాండ్ చేసింది కూడా..! సరిగ్గా దీన్నే సువర్ణావకాశం మలుచుకున్న వైసీపీ రంగంలోకి దిగిపోయింది.
ఎక్కడ చూసినా ఇదే..!
ఎన్డీఏలో మిత్రపక్షమైన టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఎన్డీఏ జుట్టు సీఎం చంద్రబాబు చేతిలో ఉంది గనుక గట్టిగా ప్రయత్నాలు చేసి.. హోదా సాధించాలని వైసీపీ పట్టుబట్టింది. వైసీపీ నేతలు మీడియా మీట్ పెట్టినా.. సోషల్ మీడియాలో చూసినా.. ఇక పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభల్లో సైతం ఇదే ప్రస్తావన తెస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. వైసీపీకి ఉన్న నలుగురు ఎంపీలు మాట్లాడితే.. నలుగురూ ఇదే డిమాండ్ చేశారు. ఇక రాజ్యసభలోనూ గట్టిగా తమ వాయిస్ వినిపించారు. దీంతో అటు జాతీయ, ఇటు ప్రాంతీయ మీడియా దృష్టిలో పడటంతో ఈ అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది. దీంతో టీడీపీని అడ్డంగా బుక్ చేసినట్లయ్యింది.
పక్కా ప్లాన్‌తోనే..!
ఢిల్లీ వేదికగా చేస్తున్న డిమాండ్ ఒక ఎత్తయితే త్వరలోనే దీనిపై ఉద్యమించాలని వైసీపీ యత్నిస్తోంది. ఇదే చంద్రబాబుపై వైసీపీ ప్రయోగించే తొలి అస్త్రం. ఎందుకంటే.. వైసీపీకి ఇదొక లక్కీ ఛాన్స్. ఎందుకంటే.. గతంలో వైసీపీ అవసరం ఎన్డీఏకు ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. ఇప్పుడు ఎన్డీఏలో కలిసిన మీరు, ఏం చెప్పినా జరుగుతుందనే విషయాన్ని జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. తొలుత ఆంధ్రాలో ఆ తర్వాత ఢిల్లీ వేదికగా ధర్నాలు, నిరసనలు అవసరమైతే దీక్షలు సైతం చేయడానికి వైసీపీ రంగం సిద్ధం చేస్తోందట. ఇలా చేయడంతో వైసీపీకి ప్లస్ అవుతుందని.. టీడీపీకి పెద్ద మైనస్సే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.