అవును.. మీరు వింటున్నది నిజమే..! ఒక్క రాజీనామా అనే మాట లేకుండా మిగిలినవి అన్నీ మాట్లాడేశారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్..! ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కంభంపాడులో మంగళవారం నాడు ఈయన చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఎన్నికల ముందు మొదలైన కొలికపూడి హడావుడి అయిపోయినా అదే కంటిన్యూ అవుతోంది..! కంభంపాడులో వైసీపీ నేత కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి ఎక్కడలేని హడావుడి చేసి మరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆయన కారు మీద కూర్చోని హీరో లెవల్‌లో రచ్చ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాను ప్రజాప్రతినిధిని అనే మాట మరిచి రచ్చ రచ్చజేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
అవును.. నిజమే..!
కాలసాని అనే వైసీపీ నేత.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారని.. కార్యకర్తలు మొదలుకుని ఇప్పటి సీఎం నారా చంద్రబాబు వరకూ అందర్నీ బెదిరించిన వాడని స్థానికంగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు.. 2013లో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి, ఇటీవల ఎన్నికల్లో కేశినేని చిన్నిపై జరిగిన దాడి కూడా ఈయన పనేనని టీడీపీ ప్రధాన ఆరోపణ. ఇక స్థానికంగా ఉండే టీడీపీ కార్యకర్తలు, నేతలను అయితే రోజూ బెదిరిచండం, కొట్టడం ఇలా చేసేవారని.. ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలను కూడా కాలసాని బెదిరించేవారని చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తాను రంగంలోకి బాధితులకు అండగా నిలబడ్డానని.. ఇందులో భాగంగానే తాను దగ్గరుండి మరీ కూల్చివేతలు జరిపినట్లు కొలికపూడి శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబును క్యాంప్ ఆఫీసుకు పిలిపించి అసలేం జరిగిందని వివరణ ఇవ్వాలని కోరారు.
ఎందుకు.. ఏమైంది..?
ప్రభుత్వం మారినా కొంతమంది అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని.. నిబంధనల ప్రకారం వ్యవహరించమని కోరినా వారి నుంచి స్పందన లేనందుకే తాను వెళ్లాల్సి వచ్చిందని చంద్రబాబుకు కొలికిపూడి వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో సీఎం గట్టిగానే క్లాస్ తీసుకున్నారని.. దీంతో కొలికపూడి నొచ్చుకున్నారని తెలుస్తోంది. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తన లాంటి వారు రాజకీయాల్లో అనవసరమన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని కూడా అందులో రాసుకొచ్చారు. కంభంపాడులో చెన్నారావుకు అక్కడి అధికారులు ఇన్ని రోజులు వంత పాడారని.. తాను అక్రమ భవన కూల్చివేతకు సిద్ధపడటంతో ఇప్పుడు అరెస్ట్ చేపిస్తున్నారని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. చూశారుగా.. ఈ పోస్టును బట్టి చూస్తే కొలికపూడి ఎక్కువ రోజులు రాజకీయాల్లో కొనసాగే అవకాశం లేనే లేదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అతని అనుచరులు కొందరు.. త్వరలోనే రాజీనామా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్న పరిస్థితి. ఏదేమైనా రెండు మూడ్రోజుల్లో తేలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.