సినిమా అభిమానిగా కొందరికి కొన్ని కాంబినేషన్స్ చూడాలని కోరిక ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా తిరుగులేని స్టార్‌డమ్‌లో ఉన్న హీరోలంతా కలిసి నటిస్తే చూడాలని ప్రతి సినిమా అభిమానికి ఉంటుంది. అలాంటి రేర్ కాంబినేషన్‌లో సినిమా వస్తే.. అనే ప్రశ్న తాజాగా కమల్ హాసన్‌కు ఎదురైంది. ప్రస్తుతం ఈ యూనివర్సల్ హీరో నటించిన భారతీయుడు 2 చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న కమల్ హాసన్‌ను మీడియా మీ సహోదరుడు రజనీకాంత్‌తో కలిసి సినిమా చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. అందుకు కమల్ హాసన్ బదులిస్తూ..
మా కాంబినేషన్‌లో ఒకప్పుడు చాలా సినిమాలు వచ్చాయి. మా కెరీర్ ఆరంభంలోనే ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఆ తర్వాత ఇద్దరం ఒకటి అనుకున్నాం.. ఏంటంటే, ఇకపై ఇద్దరం కలిసి సినిమాలలో కనిపించకూడదు అని. అందుకే కలిసి సినిమా చేయడం లేదు. వాస్తవానికి మేం చాలా మంచి స్నేహితులం. మా మధ్య ఏ విషయంలోనూ పోటీ ఉండదు. పోటీ పడలేదు కూడా. ఎప్పుడూ మేము విమర్శలు చేసుకోలేదు.
అప్పుడెలా ఉన్నామో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాం. ఒకరిని ఒకరం ఎప్పుడూ దూషించుకోలేదు. కారణం మా ఇద్దరికీ ఒక్కరే గురువు. కె. బాలచందర్ గారు. ఒకరి ఎదుగుదలను మరొకరం స్పోర్టివ్‌గా తీసుకుని కష్టపడ్డాం తప్పితే.. చులకనగా ఎప్పుడూ భావించలేదు. అదే మా మధ్య బలమైన అనుబంధానికి కారణమైంది. మా వయసు 20 ఉన్నప్పుడే మేం అలాంటి అవగాహనతో ఉన్నాం.. అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గొప్ప స్నేహితులు అంటూ నెటిజన్లు ఇద్దరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.