ఈ రెండు ఫోటోలు చూశారు కదా..! ఇందులో ఒకరిని గుర్తుపట్టినా ఇంకొకరిని మాత్రం కాస్త జూమ్ చేస్తే గానీ గుర్తు పట్టలేరనుకుంటా..! అవునండోయ్ ఇందులో ఒకరు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాగా.. మరొకరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. డిఫరెంట్, న్యూ లుక్‌లో కనిపించేసరికి సడన్‌గా గుర్తు పట్టలేకపోయారేమో కదా..! ఈ రెండు ఫొటోలను కాస్త డీప్‌గా గమనిస్తే.. మీకు ఏమనిపిస్తోంది..? అసలు ఏం చెప్పదలుచుకున్నారు..? సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..
ఇదీ అసలు సంగతి..!
చంద్రబాబును చూశారు కదా.. గోడలు లేని పూరి గుడిసెలో నులక మంచంపై కూర్చోని సామాన్యుడి ఇంట తేనీరు సేవిస్తున్నారు. పేదరికాన్ని చాటుతూ దయనీయ స్థితిలో ఉన్న ఈ ఇంటికెళ్లి చంద్రబాబు స్వయంగా వెళ్లి పెన్షన్ ఇచ్చారు సీఎం. ఎన్టీఆర్ భరోసా పేరిట కూటమి సర్కార్ జులై-01న తెల్లారుజామునుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురూ చేసింది. ఇందులో భాగంగా తొలి పెన్షన్ చంద్రబాబు చేతుల మీదుగా ఇవ్వగా.. నేరుగా లబ్ధిదారుడికి ఇంటికెళ్లి మరీ ఇచ్చారు. జీవితంలో ఎన్నడూ నమ్మలేని రీతిలో ఓ సీఎం అనుకోని అతిథిగా రావడంతో రాములు నాయక్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే.. నిరుపేద ఇంటికి నాయకుడు నడిచొచ్చాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడీ ఫొటోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.. అంతకుమించి చర్చకు దారితీసింది కూడా.
జగన్‌ను చూశారా..?
ఇక బెంగళూరు ప్యాలెస్‌లో ఉన్న వైఎస్ జగన్.. అభిమానులు, ఇంట్లో పనిచేసే వర్కర్లకు సెల్ఫీలు ఇచ్చే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బెంగళూరులోని తన ఇంటికి వెళ్లిన జగన్.. ఇలా న్యూ లుక్‌లో కనిపించారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట్లో తెగ వౌరల్ అవుతోంది. ఎప్పుడూ వైట్ షర్టులో కనిపించే జగన్.. సడన్‌గా ఇలా కుర్తాలో కనిపించడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతేరీతిలో ఇతర పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రజల కోసం, ప్రజల్లో ఉంటే.. జగన్ మాత్రం ప్యాలెస్‌లకు పరిమితం అయ్యారని ఇలాగే ఉంటుంది. ఇందుకే మాజీని చేసి ఇంటికే ప్రజలు పరిమితం చేశారనే తిట్లు గట్టిగానే పడుతున్నాయి.
ఎంత తేడా.. ఏం కథ!
చూశారుగా.. ఇటు చంద్రబాబు అటు జగన్ ఎలా ఉన్నారో..! ఈ రెండింటినీ పోలుస్తూ నెట్టింట్లో ఒకాట ఆడుకుంటున్నారు. నిజమైన, ప్రజల కోసం పుట్టిన నేత బాబు అని కొందరు అంటుంటే.. అవునా నిజమా అని సెటైర్లేస్తున్న పరిస్థితి. దేశంలో ఎన్నడూ ఏ సీఎం ఇలాంటి పనిచేయలేదని శభాష్ సీఎం.. ఇదే విజనరీ అంటే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇన్ని రోజులు వలంటీర్లు.. వలంటీర్లు అని తెగ చించుకున్న వైసీపీ చూశారుగా.. అసలు వలంటీర్ అనే వాడే లేకుండా ఎలా పెన్షన్లు పంచిపెట్టారో అంటూ టీడీపీ శ్రేణులు ఎంతగానో చెప్పుకుంటున్నాయి. ఇక ఇందుకు వైసీపీ సైతం కౌంటరిస్తూ.. చూశారుగా చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్‌ను వలంటీర్లుగా మార్చారంటే మామూలు విషయం కాదని శునకానందం పొందుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కామెంట్సే ఉన్నాయి.