గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈమధ్యన ఎన్టీఆర్ ఇంకా దేవర టీమ్ థాయిలాండ్ వెళ్ళొచ్చింది. అక్కడ హీరోయిన్ జాన్వీ కపూర్-ఎన్టీఆర్ పై బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఓ పాటని చిత్రీకరించారు. ఇక ఎన్టీఆర్ అక్కడి పని పూర్తికాగానే హైదరాబాద్‌కి వచ్చేశారు.
ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేస్తామని కొరటాల ఎప్పుడో రివీల్ చేసారు. దేవర 1 కి సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ తో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్నారు.
ఈ షెడ్యూల్ పూర్తికాగానే కొరటాల ఎన్టీఆర్-జాన్వీ కపూర్లపై మరో రెండు సాంగ్స్ చిత్రీకరించడానికి విదేశాలకు వెళ్ళిపోతారట. ఈ నెలలో ఎలాగైనా షూటింగ్ కంప్లీట్ చేయాలని, ఆగస్ట్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సెప్టెంబర్ మొత్తం సినిమాని బాగా ప్రమోట్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.