వేర్ ఈజ్ విజయసాయిరెడ్డి ఇప్పుడిదే బర్నింగ్ టాపిక్..! ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా ఇదే చర్చ..! వైసీపీలో నంబర్-02గా ఓ వెలుగు వెలిగిన సాయిరెడ్డి ఏమయ్యారు..? ఎందుకు సైలెంట్ అయిపోయారు..? అని వైసీపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ సాయిరెడ్డికి ఏమైంది..? ఎందుకు మునుపటిలా యాక్టివ్‌గా ఉండట్లేదు..? నెల్లూరు ఎంపీగా విజయసాయి మనస్పూర్తిగా పోటీచేశారా..? లేకుంటే అతి బలవంతంగా పోటీ చేయాల్సి వచ్చిందా..? జరిగిందేదో జరిగిపోయింది.. అయినా ఎక్కడా ఎందుకు కనిపించట్లేదు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
అసలేం జరుగుతోంది..?
వైసీపీలో ఓ వెలుగు వెలిగాడు..! వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత నంబర్-02గా ఎదిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి.! వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు..! నాటి వైఎస్సార్ నుంచి నేటి జగన్ వరకూ అదే కుటుంబంతో ఉన్న వ్యక్తి. జగన్ కష్టాల్లో.. నష్టాల్లోనూ వెంట ఉండి.. ఆఖరికి జైలుకెళ్లి ఊచలు లెక్కించి వచ్చారు కూడా. అందుకే వైసీపీ స్థాపించిన తర్వాత జగన్ రెడ్డి కూడా సముచిత స్థానం కల్పించడం జరిగింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు సాయశక్తులా కృషి చేసి.. ఫలితం దక్కించుకున్నారు కూడా. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డికి ఎందుకో ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. దీంతో అంతంత మాత్రమే మీడియా ముందుకు రావడం, జగన్ ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రమే హైలైట్ అవ్వడం తప్పితే ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు. ఆ తర్వాత నెల్లూరు ఎంపీగా పోటీచేస్తున్నారని ప్రకటన రావడంతో కొద్దిరోజులు వార్తల్లో నిలిచారు. కానీ.. ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!
ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాకూడదని.. అవసరమైతే కుమార్తె లేదా అల్లుడిని పోటీచేయించాలని సాయిరెడ్డి అనుకున్నారట. అయితే నెల్లూరు నుంచి పోటీ చేసి తీరాల్సిందేనని, బిగ్ షాట్ అయిన మీరు ఇలా ఆలోచిస్తున్నారేంటి..? మీరు పోటీచేస్తే నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేయొచ్చన్నది జగన్ ప్లానట. అందుకే ఇష్టం లేకపోయినా కష్టమైనా పోటీ చేశారు. అనుకున్నట్లే క్లీన్ స్వీప్ అయ్యింది కానీ.. అది వైసీపీ కాదు.. కూటమి. ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి ఎక్కడ లోటు పాట్లు ఉన్నాయి..? ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది సమీక్ష నిర్వహిస్తామని రెండు మాటలే మాట్లాడిన ఆయన.. ఇంతవరకూ ఎక్కడా మీడియా ముందుకు వచ్చిన దాఖలాల్లేవ్. రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఆ ట్విట్టర్‌లో కనిపిస్తున్నారేమో కానీ.. ఒకవేళ పదవీకాలం ముగిసిపోయి ఉంటే ఆ కాస్త కూడా కనిపించేవారు కాదేమో అని సొంత పార్టీ నేతలే అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు.. ఎప్పుడు ఏ రూపంలో అరెస్ట్ వచ్చి మీద పడుతుందో అని భయం సైతం సాయిరెడ్డిని వెంటాడుతోందట. అందుకే ఇప్పుడు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా అసలుకే ఎసరు వచ్చి పడుతుందని భయపడుతున్నారనే టాక్ నడుస్తోంది. అందుకే.. బీజేపీకి బాగా దగ్గరై తొలుత తన అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్‌ను ఆపుకుంటున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
క్యాడర్ కోరుతున్నదేంటి..?
విజయసాయి అంటే జగన్‌కు ఎంత గౌరవం అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సడన్‌గా ఏమైందోతెలియట్లేదు కానీ.. ఈయన్ను పక్కన పెట్టేసి సాయిరెడ్డి స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చారు జగన్. ఇక్కడే వైసీపీ ఓటమికి తొలి అడుగు పడిందన్నది వైసీపీ కార్యకర్తలు చెబుతున్న మాట. ఎందుకంటే.. కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా సరే వారిని చూసుకోవడంలో అయితేనేం..? ఎమ్మెల్యేలతో కలుపుగోలుగా ఉండటం..? పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా మాట్లాడాలన్నా.. చాలా క్లారిటీగా ఉండేవారు. వీటన్నింటికీ మించి వైసీపీ పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) అంతా ఈయన చేతిలోనే ఉండేది. సోషల్ మీడియా మొదలుకుని ఏ టూ జడ్ అన్నట్లుగా ఉన్నారు. సరిగ్గా 2014-2019 వరకూ ఇదే పనిచేసిన సాయిరెడ్డి.. వైసీపీ గెలుపులో జగన్ తర్వాత పాత్ర ఈయనదే అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అందుకే ఇప్పటికైనా సాయిరెడ్డిని మళ్లీ దగ్గరికి తీసుకుని ఆయనకివ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎందుకంటే.. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలన్నది సాయిరెడ్డికి తెలిసినంతగా మరెవ్వరకీ తెలియదన్నది వైసీపీ క్యాడర్ మొదలుకుని నేతల వరకూ చెబుతున్న మాట. ఇకనైనా సజ్జల కోటరిని పక్కనెట్టి సాయిరెడ్డిని రంగంలోకి దింపుతారో లేదో.. అయినా జగన్ మనసులో ఏముందో ఎవరికి ఎరుక..!