అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో సేవ చేయాలని ఎవరికుండదు చెప్పండి..! ఆయన సేవలో ఒక్క నిమిషం, ఒక్క గంట.. ఒక్కరోజైనా ఉండాలని దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఎంతో తహతహలాడుతుంటారు. అయితే.. ఏరికోరి మరీ ఈ అవకాశం ఇస్తే ఎవరైనా వద్దంటారా చెప్పండి..! ఎందుకో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మాత్రం అస్సలు వద్దంటే.. వద్దు బాబోయ్ అంటున్నారట. ఇంతకీ ఆయన ఎందుకిలా అంటున్నారు..? అశోక్ మనసులో ఏముంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
ఎందుకిలా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఇక మిగిలిందల్లా పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడమే..! ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుంది..? లేనిపోని ఆరోపణలు వస్తున్న ఈ తరుణంలో ఎవరైతే సమర్థవంతంగా పదవి న్యాయం చేయగలరు..? అని సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత సీనియర్ నేత, రాజ వంశీయులు అశోక్ గజపతి రాజు అయితే కరెక్ట్ అని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ వ్యవహారం చర్చల దశల్లో ఉండగానే అశోక్‌కు తెలిసిందట. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. ఈ మధ్యే అశోక్ గజపతిని గవర్నర్‌గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది.
నా వల్ల కాదులే!
టీటీడీ చైర్మన్ పదవి మంచిదే కానీ.. తాను న్యాయం చేయలేనని అశోక్ నొచ్చుకుంటున్నారట. ఎందుకంటే.. చిన్నపాటి మంత్రి వచ్చినా.. ఇతర రాష్ట్రాల నుంచి ఏ వీఐపీ వచ్చినా సరే ఎదురెళ్లి బొకేలు ఇచ్చి స్వాగతం పలకడం, వారికి రాచ మర్యాదలు చేయడం అయ్యే పని కాదని కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో అన్నారట. పైగా ఇలా చేయకపోతే సీఎం చంద్రబాబుకే చెడ్డపేరు వస్తుందని కూడా మనసులో మాటను కక్కేశారట. ఒక్క మాటలో చెప్పాలంటే తాను రాజు వంశీయుడిని అయ్యుండి ఇలా ఫ్రిస్టేజ్ పనులు చేయలేనని చెప్పకనే చెప్పేశారట. వాస్తవానికి తాను ఎలాంటి పదవులు ఆశించట్లేదని కేవలం విజయనగరం సంస్థానం వారసుడిగా, సింహాచలంతో పాటు రామతీర్థ ఆలయ ట్రస్టీగా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా మాత్రమే కొనసాగుతానని చెప్పేశారట. ఒకవేళ రాజు పదవులు ఆశించే మనిషే అయితే.. కుమార్తె ఆదితి గజపతిరాజుకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును ఒక్క మాట అడిగితే కాదనుకుండా ఇచ్చేసేవారని సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.