ఎవరూ ఊహించని రీతిలో రాజకీయాల్లోకి వచ్చా..! ఎవరూ ఎదిరించని వ్యక్తులను ఢీ కొని వైసీపీని స్థాపించా..! పదంటే పదేళ్లలో అధికారంలోకి వచ్చా..! అది కూడా ప్రత్యర్థులు, అఖరిని నేను కూడా కలలో అనుకోని 151 సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చాం..! ఒక్క ఛాన్స్ ఇచ్చారని ప్రజలకు ఎన్నో చేశా.. పుట్టిన పిల్లాడు/పిల్ల మొదలుకొని పండు ముదుసలి వరకు.. ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అందరికీ న్యాయం చేశా..! ఇంత చేసినా 11 సీట్లకు పరిమితం కావడం ఏంటి..? ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఏమిటీ విడ్డూరం..? ఏదో జరగరానిది జరిగింది కానీ ఎక్కడా ఆధారాలు లేవు..! అసలు ఈ ఫలితాలు చూసాక రాజకీయాలు అవసరమా..? ప్రశాంతంగా హిమాలయాలకు వెళ్లి సన్నాసుల్లో కలుద్దాం అనుకున్నా..! ఇవీ ముఖ్య కార్యకర్తలు, అత్యంత సన్నిహితుల సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలట.
అవునా.. నిజమా!
వై నాట్ 175 అని తెగ ఊదరగొట్టిన వైఎస్ జగన్.. ఆఖరికి క్రికెట్ టీంకు పరిమితం అయ్యారు. ఈ ఊహించని ఫలితాలతో జీవితం, రాజకీయంపై పూర్తిగా వ్యామోహం తగ్గిపోయిందని ఇక ఈ మాయా ప్రపంచంలో ఉండటం కష్టమని అందుకే ఇక అన్నిటికీ గుడ్ బై చెప్పేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలని జగన్ రెడ్డికి అనిపించిందని.. ఇదే విషయాన్ని పార్టీలోని అత్యంత సన్నిహితులతో అన్నారని విషయం బయటికి పొక్కింది. అసలు ఈ ఫలితాల షాక్ నుంచి తేరుకోవడానికి రెండు మూడు రోజులు పట్టిందని ఐతే.. సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లేసిన ప్రజలు, జగన్ అంటే మాట ఇస్తే తప్పడు.. మాట తప్పడు మడమ తిప్పడు అని గట్టిగా నమ్మే ప్రజలు మనతో ఉన్నారని అందుకే వాళ్ళకోసం హిమాలయలకు వెళ్లే ప్రోగ్రాం రద్దు చేసి.. జనాల కోసం నిలబడాలని ఫిక్స్ అయ్యారట జగన్.
ఆట ఆడుకుంటున్నారు..!
జగన్ ఈ మాటలు అన్నారో లేదో తెలియట్లేదు కానీ.. ప్రస్తుతానికి ఈ వ్యవహారం సోషల్ మీడియా, మీడియా.. ఇక డిజిటల్ మీడియాలో ఐతే బాబాయ్ ఒక రేంజిలో వైరల్ అవుతోంది. హమ్మయ్యా.. ఇన్నాళ్లకు జగన్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుంటే.. ఇంకా ఎందుకు ఆలస్యం ఆ పని ఏదో చేస్తే దరిద్రం పోతుందని మరికొందరు అంటున్న పరిస్థితి. ఇకనైనా ఐప్యాక్, సోషల్ మీడియాను పక్కనపెట్టి సొంత బుర్రకు పదును పెట్టాలని సొంత పార్టీ కార్యకర్తలు సూచిస్తున్న పరిస్థితి. ఐనా.. ఇలా పడటం, లేవడం.. గాయాలు మాన్పుకొని మళ్ళీ షురూ చేయడమే కదా అసలు సిసలైన పోరాటం. ఇక గెలుపు, ఓటములు అంటారా.. ఓడినోడు జీవితాంతం ఓడిపోతూనే ఉండడు కదా.. గెలిచి నిలుస్తాడు మీకు ఆ దమ్ము, ధైర్యం ఉందని ఈ ఐదేళ్లు ప్రజల్లో ఉండి పోరాటం చేయాలని కార్యక్తలు సూచిస్తున్న పరిస్థితి. ఇక జగన్ మనసులో మనసులో ఏముందో..? ఏం జరుగుతుందో చూడాలి మరి.